ఎమ్మెల్యేలను కాపాడుకోగలరా?

మూడు రోజుల క్రితమే తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన చిరంజీవి పార్టీకి చెందిన ముఖ్య విభాగాలతో సమావేశం కాకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ లతో సరిపెడుతున్నారు. గెలిచే అవకాశాలున్న అభ్యర్ధుల జాబితా ఇప్పటికే తయారు చేశారు కాబట్టి వారిని పిలిపించి సామూహికంగా ఒకసారి, విడివిడిగా ఒకసారి చిరంజీవి వారితో మాట్లాడి వారిని ఉత్సాహపరుస్తూ ఉంటే బాగుండేది. ఎన్నికల ఫలితాల తర్వాత తమ ఎమ్మెల్యేలు, ఎంపీలు గోడ దూకిపోకుండా ప్రజారాజ్యం అధినేతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కోడి తన పిల్లలను గద్దలు ఎత్తుకుపోకుండా ఎంత జాగ్రత్తగా ఉంటుందో ఇక్కడ కూడా అంత అప్రమత్తత అవసరం. విజయం వరించే అవకాశాలున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులతో ఆప్యాయంగా మాట్లాడి, తన పట్ల వారిలో విధేయతను పెంచుకోవలసిన అవసరం ఇప్పుడు చిరంజీవికి ఉంది.
అయినా చిరంజీవి షూటింగ్, డబ్బింగ్ ముగిసిన తర్వాత రిలాక్స్ అయినట్టుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకుడి డిక్షనరీలో రిలాక్స్ అనే పదం ఉండకూడదు. కాంగ్రెస్ నాయకులు అప్పుడే కొందరు ప్రజారాజ్యం అభ్యర్ధులతో రహస్య చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. వారిని ఫిరాయింపులకు ప్రోత్సహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో వంతు ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే అది ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రాదు. కాంగ్రెస్ కు పదో పరకో ఎమ్మెల్యేల బలం తగ్గితే ఒక్కో ఎమ్మెల్యేకు పాతిక కోట్లు పోసైనా వారిని కొనుగోలు చేయడానికి వైఎస్ వర్గం మేధావులు వ్యూహం రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. తాను ముఖ్యమంత్రి నన్న ధీమా వైఎస్ లో కన్పించడానికి ఇదే కారణమని చెబుతున్నారు.
రాజకీయ క్రీడలో ఆరితేరిన చంద్రశేఖరరావు తన అభ్యర్ధులందరితో సమావేశం జరిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో వారికి వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేలా ఈసారి మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కోరారు. వారి రాజకీయ భవిష్యత్తుకు ఆయన భరోసా ఇచ్చారు. ఇటువంటి సమావేశన్ని చిరంజీవి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ప్రజారాజ్యం సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications