చిరంజీవికి రాజకీయాలు మొహం మొత్తాయా?

చిరంజీవికి సోనియా గాంధీ అపాయింట్ మెంట్ ఇచ్చే అవకాశముందని అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో ప్రజారాజ్యానికి ఆశించినన్ని స్ధానాలు రాకపోవడంతో చిరంజీవి షాక్ తిన్నా, ఆయన ఈ నాలుగైదు నెలలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. రాజకీయ నాయకుడిగా కొత్త పాత్ర పోషణలో కొంత కాలం ఆనందం అనుభవించారు. ఇప్పుడు ఆ పాత్ర ఆయనకు బోర్ గా అనిపిస్తున్నట్టుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో యాభై స్ధానాలకు పోటీ చేయడం ఆ మేకపోతు గాంభీర్యంలో భాగమే. గ్రేటర్ లో కనీసం ఇరవై స్ధానాలు వచ్చినా కాంగ్రెస్ లో విలీనానికి ముందు మంచి డిమాండింగ్ పవర్ ఉంటుందని చిరు వర్గీయుల ఆలోచన.
సొంతంగా పార్టీని నడపడం ఎంత కష్టమో, రాజకీయాల్లో అవకాశవాదం ఎంత దారుణంగా ఉంటుందో చిరంజీవి స్వయంగా చూశారు. తన అభిమానులు, తన కులం వారు గట్టిగా నిలబడితే తాను ముఖ్యమంత్రినై పోవడం చాలా సులభమని ఆయన కట్టుకున్న గాలి మేడలు కూలిపోయాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు 25 శాతం ఉన్న కాపు, దాని అనుబంధ కులాల వారి ఓట్లు చిరంజీవి పార్టీకి ఆశించిన స్ధాయిలో పడలేదు.
ఎన్నటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేని పార్టీని నడపడం కంటే కాంగ్రెస్ లో విలీనం చేసి రెండు రాజ్యసభ సభ్యత్వాలు, ఇతర డిమాడ్ల సాధన ఉత్తమమని చిరంజీవి, ఆయన బావమరిది అల్లు అరవింద్ అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్, నాగబాబులు ఎన్నికల తర్వాత ప్రజారాజ్యానికి దూరంగా ఉండడం వల్ల కూడా చిరంజీవికి పార్టీ మీద మోజు తగ్గిపోయినట్టు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications