భవిష్యత్తు ప్రశ్నార్థకమే

తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెసు పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్న తెలుగు మహిళ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై భరోసాతో ఆమె కాంగ్రెసు పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. కాంగ్రెసు పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం లభిస్తుందనే ఆశతో ఆమె అడుగు ముందుకు వేశారు. నిజానికి, రాజశేఖర రెడ్డికి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే తత్వం ఉంది. రాజశేఖర రెడ్డి అకాల మరణం రోజా రాజకీయ భవిష్య్తత్తు ప్రమాదంలో పడినట్లే చెప్పాలి. ప్రాధాన్యం లేకుండా కాంగ్రెసు పార్టీలో ఉండడం సాధ్యం కూడా కాదు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చెప్పలేం. కానీ మరొకరు నాయకత్వంలోకి వస్తే మాత్రం ఆమెకు కష్టమే.
రాజశేఖర రెడ్డి లేకున్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు కూడా చక్రం తిప్పేది కెవిపి రామచందర్ రావే కాబట్టి రోజాకు ఇచ్చిని హామీలు అమలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి లాబీ అంతా కెవిపి కేంద్రంగానే ముందుకు కదులుతోంది. ఒక వేళ ప్రయత్నాలు బెడిసి కొట్టి జగన్ ముఖ్యమంత్రి కాకపోతే మాత్రం రోజా పునరాలోచనలో పడాల్సిందే. అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పటిలా ఆమెను స్వీకరిస్తుందా అనేది అనుమానమే.
అలాగే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు దూరమై అభివృద్ధి మంత్రంతో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి దగ్గరైన రాములమ్మ విజయశాంతి పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే మారింది. పార్టీలో చేరకుండానే కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తూ తగిన ఫలితం పొందాలని ఆశించిన విజయశాంతి ఆశలు కల్లలైనట్లే. ఆమెను కాంగ్రెసు నాయకత్వం ఆదరిస్తుందా అనేది సందేహమే. తెలంగాణ నినాదాన్ని పక్కన పెట్టినందుకు ఆమెపై ఇప్పటికే ప్రజల్లో ఆగ్రహం నెలకొని ఉంది. మళ్లీ తెలంగాణ నినాదం ఎత్తుకోవడం ఆమె వల్ల అయ్యే పని కాదు. ఎత్తుకున్నా ప్రజలు తిరస్కరిస్తారు.
తెలుగుదేశం అసమ్మతి శాసనసభ్యులు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి పరిస్థితి కూడా దారుణంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుపై తిరుగుబాటు బావుటా ప్రకటించి కాంగ్రెసులో చేరిన కెకె మహేందర్ రెడ్డి, తదితరుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications