వైఎస్ మెడపై కత్తి

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లారో, ఎన్ని సూట్ కేసులు నిండు గర్భిణుల్లా వెళ్ళి ఖాళీగా తిరిగొచ్చాయో అన్నది ఇప్పుడు అప్రస్తుతం. అది పాత కథ. కాంగ్రెస్ అధిష్టాన వర్గం మాత్రం "రాజశేఖరా, నీపై మోజు తీరిపోయెరా" అన్నట్టు వ్యవహరించబోతోందని ఢిల్లీ నుంచి వస్తున్న ఇన్ పుట్స్ సూచిస్తున్నాయి. 230 అసెంబ్లీ స్ధానాల్లో గెలుస్తామన్న ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వారం రోజులపాటు మంచు కొండల మధ్య సేదదీరడానికి కుటుంబసమేతంగా సిమ్లాలో విడిది చేస్తున్నారు. అంత చల్లదనంలో ఉన్నా ఆయనకు ఢిల్లీ నుంచి వేడి వేడి సంకేతాలు అందుతున్నాయి. కాంగ్రెస్ కు అనుకున్నన్ని స్ధానాలు రాకపోతే, పీఅర్పీ, టీఅర్ ఎస్ ల మద్దతు తీసుకోవలసి వస్తే "బీసీ" ముఖ్యమంత్రిని రంగంలోకి తీసుకురావాలని అధిష్టానవర్గం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

వైఎస్ ప్రభుత్వం తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం, తెలంగాణ విషయంలో అధిష్టానవర్గాన్ని తప్పుదోవపట్టించడం, మిత్రపక్షాలను దూరం చేసుకోవడం వంటి విషయాల్లో వైఎస్ పై హైకమాండ్ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ వస్తే వైఎస్ ను తప్పించే సాహసాన్ని కాంగ్రెస్ చేయదు. అలా రానప్పుడు మాత్రం డి.శ్రీనివాస్, కె కేశవరావు వంటి వారిని ముఖ్యమంత్రిగా చూపించి టీఅర్ ఎస్, ప్రజారాజ్యం పార్టీల మద్దతు సంపాదించాలనుకుంటోంది.

వైఎస్ భవితవ్యం ఇప్పుడు డోలాయమాన స్ధితిలో పడడంతో వైఎస్ వ్యతిరేకవర్గం బలపడుతోంది. అయితే వ్యతిరేకవర్గంలో నెంబర్ వన్ స్ధానంలో ఉన్న డిఎస్ ను దెబ్బతీయడానికి వైఎస్ వర్గం మేధావులు వ్యూహరచన చేసినట్టు సమాచారం. ఈ ప్రాంతంలో అత్యధిక స్థానాలు కోల్పోతే అందుకు వైఎస్‌ను బాధ్యుడిని చేసేందుకు డీఎస్‌ వర్గం, డీఎస్‌పైనే నెపం మోపేందుకు వైఎస్‌ వర్గం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. మెజార్టీ రాని పక్షంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, సొంత పార్టీలోని ప్రత్యర్ధులను దెబ్బతీయడం ఈ రెండు అంశాల మీద వైఎస్ గ్రూపు దృష్టి సారిస్తోంది.

మొత్తంగా తెలంగాణలో అత్యధిక స్థానాలను కోల్పోతామనే అంచనాకు వచ్చిన వైఎస్‌ వర్గం ఇందుకు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌పై నెపం మోపి ఆయన్ను సరాసరి ఇంటికే పంపాలని భావిస్తోందని సమాచారం. శ్రీనివాస్‌ స్థానంలో పొన్నాల లక్ష్మయ్యను రంగంలోకి దించేందుకు కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు.

తెలంగాణలో ఫలితాలు తమకు అధికారాన్ని దూరం చేసే పరిస్థితి వస్తే, ప్రజారాజ్యం నుంచి మెజార్టీకి కావల్సిన మద్దతు సంపాదిస్తామని వైఎస్‌ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అవసరమైతే టీఆర్‌ఎస్‌ను కూడా గతంలో వలే చీల్చేందుకు సైతం వెనుకాడకూడదన్న ఆలోచనలో వైఎస్‌ శిబిరం ఉంది. ఇందుకు ఏ స్పీకర్‌ అయితే తమకు అనుకూలంగా ఉంటుందనే విషయంలో కూడా వారు ఒక అంచనాకు వచ్చినట్లు భావిస్తున్నారు.

అదే సందర్భంలో డీఎస్‌ శిబిరం కూడా ఈ ఎత్తుగడలకు దీటుగా స్పందిస్తోంది. కాంగ్రెస్‌కు మెజార్టీ రాని పక్షంలో వైఎస్‌ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు చేసే ప్రయత్నాలను చిత్తు చేయాలన్న ఆలోచనలో డీఎస్‌ వర్గం ఉంది. ఇందుకోసం కొత్తగా 'బీసీ సీఎం' అనే వాదనను లేవనెత్తుతున్నారు.

తెలంగాణ ప్రాంతంలో అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ప్రచారం వరకూ వైఎస్‌ అంతా తానై వ్యవహరించారని, తనను పూర్తిగా విస్మరించారని రెండు రోజుల క్రితం సోనియాను కలిసిన సందర్భంగా డీఎస్‌ ఆమె వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కనీసం ఆరు స్థానాల్లో తాను సూచించిన అభ్యర్థులకు టికెట్లు రాలేదన్న కోపంతో స్వతంత్రుల పేరుతో వైఎస్‌ తన అభ్యర్థులను నిలబెట్టి పార్టీ అభ్యర్థుల ఓటమికి ప్రయత్నించారని డీఎస్‌ తన నివేదికలో సోనియాకు వివరించినట్లు సమాచారం. హైకమాండ్ కు అత్యంత విధేయుడైన డి. శ్రీనివాస్ ఇప్పుడు ఢిల్లీ సంకేతాల కోసం ఎదురుచూస్తున్నారు. తనకు అనుకూల సంకేతాలు రాగానే ఆయన విజృంభించనున్నారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+