జగన్ దీక్షనే బాబు టార్గెట్

వైయస్ జగన్ విసిరిన సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. రైతు సదస్సును తొలుత హైదరాబాదులోని నిర్వహించాలని అనుకున్నారు. అయితే, రైతుల మరణాలు సంభవించిన జిల్లాల్లో కాకుండా హైదరాబాదులో దీక్ష చేయడంపై కూడా వైయస్ జగన్ వర్గీయులు విమర్శలు చేశారు. దీంతో గుంటూరు జిల్లాల్లో రైతు సదస్సు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సదస్సుకు వామపక్షాల నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
కాగా, గత ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్న చంద్రబాబుకు వైద్యులు నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. దీక్ష ఎప్పుడు, ఎలా విరమించాలనే విషయంపై చంద్రబాబు సంశయంలో పడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి తగిన హామీలు రాకుండా విరమించడం సమస్యగానే ఉంది. అయితే, చంద్రబాబు దీక్ష కొనసాగుతుందని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. ఈ దీక్ష ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతుందా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఎలాగూ, వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు కాబట్టి చంద్రబాబు ఆరోగ్యానికి ప్రమాదం లేకపోవచ్చు. లేకపోతే ఈలోగా విరమించి, గుంటూరు రైతు సదస్సుకు శక్తిని కూడగట్టుకుంటారా అనేది చూడాల్సి ఉంది. రైతుల కోసం నిలబడ్డామనే ప్రయోజనం పొందడానికి వైయస్ జగన్, చంద్రబాబు పోటీ పడుతున్నారనేది స్పష్టం. ఈ పోటీలో పైచేయి సాధించడమే చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆయన దీక్ష విరమణ ఉంటుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications