సిఎం అభ్యర్ధి శ్రీనివాస్ అభ్యర్ధికి చిక్కుముడులు!

2009 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో పరాజయం పొందిన నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి త్వరలో జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి డీఎస్ సిద్ధమవుతున్నారు. ఇందుకు ఆయన తెరచాటున ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలి కాలం గా ఆయన తన సొంత నియోజకవర్గంలోనే అధికంగా గడుపుతున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులతో, జిల్లా నేతలతో పలుమార్లు సమావేశమై ఉపఎన్నికల్లో తన విజయం కోసం వ్యూహరచన చేశారు.
అసెంబ్లీకి ఎన్నికవడం ద్వారా భవిష్యత్తులో పార్టీలో మరింత పట్టు సాధించాలని పట్టుదలతో డీఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో గెలువడం ద్వారా తన ప్రత్యర్థుల నోటికి తాళం వేసినట్లవు తుందని, పైగా ముఖ్యమంత్రి రోశయ్యను ఒక వేళ మార్చాలని హైకమాండ్ భావిస్తే, ఆ తరువాత సీఎం పదవి రేస్ లో తనకు తొలి ప్రాధాన్యత ఉంటుందని ఆశిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే ఆయన నిజామాబాద్ అర్బన్ లో ఈ సారి తన గెలుపు అంత సులభం కాదని తెలిసి కూడా పోటీకి సిద్ధమవుతున్నారు.
తన విధేయులను నిజామాబాద్ లో మోహరించి విస్తృత ప్రచారం చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అలాగే పెద్ద ఎత్తున ధన సమీకరణ చేసుకుంటున్నారు. అయినా తెలంగాణ సెంటిమెంట్ కు ఎదురు వెళ్ళడం ఒక సాహసమే. ఎన్నికల ప్రచారంలో ఆయన సున్నితమైన తెలంగాణ సమస్యను స్పృశించకుండా జాగ్రత్త పడే అవకాశముంది. అయితే హైకమాండ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం కాదని అయన సుతిమెత్తగా ఓటర్లకు చెప్పే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications