హైదరాబాద్: తీవ్ర నష్టాలతో మీడియా వ్యాపారం చేస్తున్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి మళ్ళీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కన్పిస్తోంది. ముఖ్యమంత్రి పదవి ఉంటే గానీ తన వ్యాపార నష్టాలను అధిగమించలేమని గ్రహించిన ఆయన మళ్ళీ పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. అయితే రోశయ్య మీద పూర్తి విశ్వాసం ఉంచిన సోనియా గాంధీ రాష్ట్ర పరిణామాలపై ముఖ్యంగా కొందరు నాయకులపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం చల్లబడిన నేపధ్యంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ కు తానే సరైన ముఖ్యమంత్రినని జగన్ అతి విశ్వాసంతో ఉన్నారు. ఆయనను నడిపిస్తున్న మేధావులు కూడా ఇదే సరైన సమయమని సలహాలు ఇస్తున్నట్టు కన్పిస్తోంది. వైఎస్ సొంత మనిషి అయిన మంత్రి రఘువీరారెడ్డి పదే పదే వైఎస్ మరణం వెనుక కుట్ర ఉందని చెబుతూ వస్తున్నారు.
వైయస్ మరణంపై టీవి చానెళ్ల వార్తాకథనాలు, రిలయన్స్ కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వైయస్ మరణం వెనక రిలయన్స్ అధినేతల హస్తం ఉందంటూ టీవీ 5 తో పాటు సాక్షి టీవీ చానెల్ లో వార్తా కథనం ప్రసారం కావడాన్ని ఆమె సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.
కార్పొరేట్ సంస్థల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మీడియా చానెళ్ల వార్తా కథనాలపై రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సీరియస్ గా తీసుకున్నారు. సోనియాకు ఆయన ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసత్య ప్రచారంపై, రిలయన్స్ ఆస్తులపై దాడులపై ఆయన సోనియాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి