ఎన్టీఆర్- లక్ష్మీ పార్వతి ప్రేమపై హరికథలు!

ఎన్టీవీ, ఐ న్యూస్ ఆమె అనుభవాలను చక్కగా ప్రేక్షకులకు అందించాయి. 1985లో ఉపేంద్ర తనను ఎన్టీఆర్ కు పరిచయం చేసినప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే ప్రేమభావం పెరిగిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు. అప్పటికి ఆమె తన తొలి భర్త వీరగంధం వెంకట సుబ్బారావుతో కాపురం చేసుకుంటున్నారు. 1994లో మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాతే ఆమెను ఎన్టీఆర్ పెళ్ళి చేసుకోగలిగారు. స్త్రీ పురుష సంబంధాల గురించి లక్ష్మీ పార్వతికి మంచి స్పష్టత ఉంది. పడకగదిలో మంచం మీద స్త్రీ పురుషులు ఎలా శయనించాలి, ఎటువంటి మాటలు మాట్లాడుకోవాలి అన్న విషయాలను గతంలో ఆమె ఒక పత్రికలో వ్యాసంగా రాశారు.
ఎన్టీఆర్ మరణానంతరం జరిగిన సంఘటనలపైన, లక్ష్మీపార్వతి మీద వచ్చిన ఆరోపణల మీద ఈ చానల్స్ ఫోకస్ చేయలేదు. వారి పరిధి రాజకీయాలకు, ఎన్టీఆర్ - లక్ష్మీపార్వతి రోమాన్స్ కే పరిమితమయ్యాయి. ఎన్టీఆర్ మరణానంతరం విలువైన వజ్రాలను, బంగారాన్ని, నగదును లక్ష్మీపార్వతికి సన్నిహితులైన నాయకులు దాచిపెట్టడానికి తీసుకెళ్లారన్న ఆరోపణలు వచ్చాయి. అసలు ఎన్టీఆర్ ఆకస్మిక మరణం మీద కూడా భిన్న కథనాలు వచ్చాయి. లక్ష్మీపార్వతి ఆయన మరణ ఉదంతంపై చెప్పిన విషయాలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉండడం కూడా అనుమానాలకు తావిచ్చింది.
ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాస్తానంటూ ఆయన జీవిత భాగస్వామి అయిన లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గురించి ఎన్నో మంచి విషయాలు కూడా చెప్పారు. పైకి ఎంతో గంభీరంగా కన్పించినా ఆయన మనసు వెన్న వంటిదని ఆమె చెప్పారు. చంద్రబాబు నాయుడు ఆయనను వెన్నుపోటు పొడవకపోతే ఇప్పటివరకు బతికిఉండేవారని చెప్పారు.