విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడలో సూరి దుమారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Maddelacheruvu Suri
విజయవాడ సివిల్ వివాదం సెటిల్మెంట్ లో పరిటాల రవి హత్య కేసు నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి మనుషులు పాలు పంచుకున్నారనే వార్త తీవ్ర దుమారం రేపుతోంది. గత మూడు రోజులుగా ఇందుకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. సూరి మనుషులెవరూ విజయవాడకు రాలేదని విజయవాడ నగర పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు ఎంతగా చెప్పినా ఆ కలకలం ఆగడం లేదు. సాయి అన్నపూర్ణ ప్యాకేజింగ్ అధినేత సుభాష్ చంద్రబోస్ ఆస్తి తగాదాల్లో సూరి మనుషులతో పాటు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధువునంటూ కార్తిక్ రెడ్డి అనే వ్యక్తి తలదూర్చి తమ ఇష్టానుసారంగా పరిష్కరించారని వార్తలు వచ్చాయి. వంద కోట్ల వార్షిక టర్నోవర్, 40 కోట్ల విలువల గల ఆ కంపెనీలో వారు 98 శాతం వాటాను కొట్టేశారని ఆరోపణలు వచ్చాయి. అప్పటి వరకు ఆ కంపెనీలో సుభాష్ చంద్రబోస్, ఆయన కుమారులు శ్యాంప్రసాద్, కృష్ణప్రసాద్ మాత్రమే డైరెక్టర్లు. కొత్తగా తొమ్మిది మంది డైరెక్టర్లలో పుట్టుకోచ్చి యజమానిని బయటకు గెంటేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ తొమ్మిది మంది డైరెక్టర్లలో ఓ వ్యక్తి సూరి మనిషి అని అంటున్నారు. ఆ వ్యక్తిని విజయవాడ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు పిలిపించి మాట్లాడారు.

సాయి అన్నపూర్ణ ప్యాకేజింగ్స్ అధినేత సుభాష్‌చంద్రబోస్, ఆయన కుమారులు శ్యాం ప్రసాద్, కృష్ణప్రసాద్ మధ్య ఆస్తి వివాదం నడుస్తోంది. దీనిపై హోం మంత్రి వరకు ఫిర్యాదులు వెళ్లాయి. కృష్ణప్రసాద్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన కార్తీక్‌రెడ్డి, సూరి బ్యాచ్‌లు ప్రవేశించాయని అంటున్నారు. కృష్ణప్రసాద్ సహకారంతో తమ అనుచరులైన 9 మందిని అక్టోబర్ 27న డైరెక్టర్లుగా చేర్చారు. కృష్ణప్రసాద్‌ను ఎండీగా నియమించారు. తిరుపతికి చెందిన బిరుదాల ప్రదీప్ ‌కుమార్, అనంతపురానికి చెందిన మల్లిశెట్టి భానుకిరణ్ (ఇతను సూరికి అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు), విజయవాడకు చెందిన గోపాలకృష్ణప్రసాద్, హైదరాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్‌రెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, నీల శ్రీనివాస్, ప్రత్యూష్, చిట్టినేని పరశురామ్, కొల్లూరు ధర్మారావులను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ 'చట్టం ప్రకారమే' కొత్త డైరెక్టర్లుగా చేసేశారు. సుభాష్ చంద్రబోస్, పెద్ద కుమారుడు శ్యాంప్రసాద్ చిన్న కుమారుడు కృష్ణప్రసాద్ కు వ్యతిరేకంగా ఉన్నారు.

శ్యాంప్రసాద్ మాత్రం సూరి గ్యాంగ్ వచ్చి తమ వివాదంలో కల్పించుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రదీప్ కుమార్ ను, భాను కిరణ్ ను పిలిపించి సీతారామాంజనేయులు మాట్లాడారు. సూరి మనుషులు వచ్చారని శ్యాంప్రసాద్ మీడియాకు కూడా చెప్పారు. ఈ వివాదం నేపథ్యంలో బోస్ కుమారులు శ్యాంప్రసాద్, కృష్ణ ప్రసాద్ లను పిలిపించి మీడియా ప్రతినిధులతో సీతారామాంజనేయులు మాట్లాడించారు. అయితే, సూరి గ్యాంగ్ వచ్చిందని శ్యాంప్రసాద్ చెప్పారు. అయితే, దాన్ని సీతారామాంజనేయులు ఖండిస్తున్నారు. వివాద పరిష్కారానికి తాను ప్రదీప్ కుమార్, భాను కిరణ్ ను పిలిపించిన మాట వాస్తవమేనని, అయితే వారు సూరి మనుషులు కారని బోస్ చిన్న కుమారుడు కృష్ణ ప్రసాద్ చెప్పారు.

విజయవాడకు సూరి మనుషులెవరూ రాలేదని సీతారామాంజనేయులు శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తగాదాను తమ కుటుంబ సభ్యులం మాత్రమే పరిష్కరించుకున్నామని బోస్ కుమారులు చెబుతున్నట్లు ఆయన తెలిపారు. ఏమైనా తేడా వస్తే బైండోవర్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సెంటిల్ మెంట్ తో సూరికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సూరితో కూడా సీతారామాంజనేయులు ఫోన్ లో మాట్లాడినట్లు చెబుతున్నారు. తనకు ఆ సెటిల్మెంటుతో ఏ విధమైన సంబంధం లేదని సూరి చెప్పాడని అంటున్నారు. ఏమైనా, ఈ వివాదం సెటిల్మెంట్ విజయవాడలో పెద్ద దుమారాన్నే రేపుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X