కెసిఆర్, బాబు డిష్యూం

కెసిఆర్ పగటి కలలు కంటున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యపై తెలంగాణవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మరోసారి బయటపడిందని తెరాస నాయకులు విమర్సిస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం క్యాడర్ తెరాసలోకి వలసలు పోతుండడంతో పార్టీ చురుగ్గా కనిపించడానికి ఈ వివాదం చంద్రబాబుకు పనికి వచ్చిందని భావించవచ్చునేమో.
తెలంగాణ సాధన కోసం కాంగ్రెసు అధ్యక్షురాలు, యుపిఎ చైర్ పర్సన్ సోనియా నివాసం వద్ద ధర్నాలు చేద్దామని తెలుగుదేశం నాయకులు తెరాసకు పిలుపునిచ్చారు. అందుకు తెరాస అధ్యక్షుడు కెసిఆర్ సయ్యంటూ అయితే, దానికి ముందు తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు చేత శ్రీకృష్ణ కమిటీకి లేఖ ఇప్పించాలని షరతు పెట్టారు. చంద్రబాబుతో శ్రీకృష్ణ కమిటీకి లేఖ ఇప్పించడం తెలుగుదేశం తెలంగాణ నాయకుల తరం కాదనే విషయం కెసిఆర్ కు తెలియంది కాదు.
కెసిఆర్ కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారనే విమర్శను తెలుగుదేశం నాయకులు ప్రధానంగా ముందుకు తెస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు ఉపయోగపడుతుందో చెప్పలేం. కానీ, తెలుగుదేశం, తెరాస నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెరాస ముందుకు దూసుకుపోవడానికి ప్రయత్నిస్తుంటే, తెలుగుదేశం తన ఉనికిని కాపాడుకోవడానికీ క్యాడర్ జారిపోకుండా చూసుకోవడానికీ ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications