రేపు ఏం జరగనుందన్నది చిదంబర రహస్యం

రాష్ట్ర నేతల కోలాహలంతో హస్తిన కిటకిటలాడుతోంది. ఢిల్లీలో రేపు జరగబోయే అఖిలపక్ష భేటీకి సన్నాహకంగా ముఖ్యమంత్రి రోశయ్య మొదలుకొని వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు ఢిల్లీలో మకాం వేసారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నేతలు పోటాపోటీగా ఢిల్లీ పెద్దల్ని కలుస్తూ తమ తమ వాదనలు వినిపిస్తున్నారు.
ప్రాంతాల వారీగా, పార్టీల వారీగా నేతలు అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటూ విస్తృత వ్యూహరచనలో నిమగ్నమై వున్నారు. మరోపక్క ముఖ్యమంత్రి రోశయ్య రేపు జరగబోయే అఖిలపక్ష భేటీకి తాను హాజరవుతానని స్పష్టం చేసారు. అయితే చర్చల ప్రక్రియలో పాల్గొనబోనని, కేవలం చర్చల ప్రతినిధులు చెప్పేది వింటానికే పరిమితమవుతానని వెల్లడించారు. ఇక రెండు రోజుల ముందే ఢిల్లీ చేరుకున్న కెసిఆర్ వివిధ పార్టీల పెద్దల్ని, కేంద్ర మంత్రుల్ని కలుస్తూ తెలంగాణ వాణి వినిపించడంలో బిజీ బిజీగా వున్నారు.
పిసిసి చీఫ్ డిఎస్, లగడపాటి రాజగోపాల్, అఖిలపక్ష భేటీలో పాల్గొనే ఎనిమిది పార్టీల ప్రతినిధులు, రెండు ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీల సీనియర్ నేతలు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పరస్పర భేటీలు, మంతనాలతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు లో ఢిల్లీ వెళ్ళేందుకు టికెట్ల కోసం నేేతలు క్యూకట్టారంటే పరిస్థితిని ఊహించవచ్చు.












Click it and Unblock the Notifications