గాలి అరెస్టుకు సిబిఐ బిగ్ స్కెచ్

గాలి గురించి పూర్తిగా ఆసుపాసులు తెలుసుకున్న తర్వాతనే సిబిఐ అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరో విషయం ఏమంటే వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై సిబిఐ దాడులు చేస్తుండటంతో అందరి దృష్టి ఇటువైపు మరలిన సమయంలో సిబిఐ అటు నుండి పనులు చకచకా చేసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వార్తాపత్రికలు, టీవీ చానెళ్లు పలు రకాలుగా వార్తాకథనాలను ప్రచురిస్తున్నాయి. వాటన్నింటినీ క్రోడీకరిస్తే గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిబిఐ పెద్ద స్కెచే వేసినట్లు అర్థమవుతోంది.
సాధారణంగా గాలి జనార్ధన్ రెడ్డి ప్రతి ఆదివారం తన సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తదితరులతో సమావేశమై వ్యాపార కార్యకలాపాలపై చర్చిస్తారట. ఈ విషయం తెలుసుకున్న సిబిఐ అదివారం గాలి పూర్తిగా ఇంట్లోనే ఉండటంతో సోమవారం ఉదయం అయితే దొరుకుతాడని భావించి వేకువ జామునే వెళ్లినట్లుగా తెలుస్తోంది. సిబిఐ అధికారులు పదిహేను రోజులుగా ఆటోల్లో తిరుగుతూ గాలి కదలికలను ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. గాలి కదలికలను ఎప్పటికప్పుడు సిబిఐ జెడి లక్ష్మీ నారాయణకు చేరవేస్తూ వచ్చారట. నోటీసుల విషయంలోనే అదే చాతుర్యం ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. గాలి ఇంట్లో పని చేసే వంట మనుషులు, ఊడ్చే వారి పైనా నిఘా పెట్టారట. పత్రికల సేల్స్ రిప్రజెంటేట్ పేరుతో ఓ సిబిఐ అధికారి గాలి ఇంటి వద్దకు కూడా వెళ్లారట. గాలి ఇంటి వెనుక ఉండే ఎత్తైన కొండ వద్దకు పశువుల కాపరిగా కూడా వెళ్లి ఇంటిని పరిశీలించినట్లుగా తెలుస్తోంది.
గాలి గురించి పూర్తిగా ఆరా తీసి అక్కడ తిష్టవేశాకే ఓ వ్యక్తిని అరెస్టు చేయాలి సహకరించాల్సింగా స్థానిక ఎస్పీని సిబిఐ అధికారులు అడిగారట. సోమవారం ఉదయం లోపలకు వెళుతున్న సిబిఐ అధికారులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించడంతో వారిని తప్పించి ఇంట్లోకి ప్రవేశించారట. సిబిఐ జెడి లక్ష్మీ నారాయణే స్వయంగా గాలికి మైనింగ్ విషయంలో అరెస్టు చేస్తున్నట్లు చెప్పారట. అరెస్టు వ్యాఖ్యలతో షాకైన గాలి జెడి అనుమతి తీసుకొని తన భార్య, కొడుకు, కూతుళ్లతో మాట్లాడి వారిని దగ్గరకు తీసుకొని విశ్వాసంగా ఉండే వంటమనిషికి వారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సిబిఐ అధికారులతో వచ్చారట. గాలిని అరెస్టు చేసిన అనంతరం ఓఎంసి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను అరెస్టు చేశారు. వీరి అరెస్టు తర్వాత మిగిలిన అధికారులు గాలి ఇంట్లో సోదాలు చేసి కిలోల కొద్ది బంగారం, మూడు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications