చిరంజీవికి మెగా ప్రాధాన్యం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి డి. శ్రీనివాస్ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆయనతో మంతనాలు జరిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంగళవారం చర్చలు జరిపిన తర్వాత శ్రీనివాస్ చిరంజీవి నివాసానికి వెళ్లి చర్చించారు. పార్టీ, ప్రభుత్వ నిర్ణయాల్లో తనకు ప్రాధాన్యం పెరగడం చిరంజీవికి ఆనందాన్ని ఇచ్చినట్లే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి చెందినవారికి కాంగ్రెసు టికెట్లు కూడా లభించే అవకాశాలున్నాయి. శాసనసభ్యుల తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో ప్రజారాజ్యం పార్టీ నాయకుడు ఒకరు ఉండే అవకాశం ఉంది. గతంలో వైయస్సార్ హయాంలో శాసనమండలికి ఎన్నిక కావడానికి ప్రయత్నించిన చిరంజీవి సోదరుడు నాగబాబుకు ఆ అవకాశం దక్కుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే, పార్టీ నుంచి ఎమ్మెల్సీ సీటుకు పోటీ ఎక్కువగానే ఉంది. అల్లు అరవింద్, సి. రామచంద్రయ్య, వేదవ్యాస్, కోటగిరి విద్యాధర రావు వంటి సీనియర్ నాయకులు ఉన్నారు. అయితే, సి. రామచంద్రయ్య గానీ, అల్లు అరవింద్ గానీ శాసనమండలికి వెళ్లడానికి ఇష్టపడకపోవచ్చు. వారు రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి భవిష్యత్తు ఏమిటనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే, ఇందుకు సంబంధించి చిరంజీవికి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు. పార్టీలో అత్యంత ప్రధానమైన స్థానం ఆయనకు దక్కుతుందని డి. శ్రీనివాస్ కూడా చెప్పారు. పార్టీ విలీనమైన వెంటనే అందుకు సంబంధించిన నియామకం జరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications