జగన్ ఎమ్మెల్యేలపైనే గురి

ఈ స్థితిలో వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడినట్లు కనిపిస్తున్నారు. దాంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. మొదటి కౌంటింగ్‌లోనే గెలవాలంటే ఒక్కో ఎమ్మెల్సీకి 27 ఓట్లు అవసరం. కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో 155 మంది సభ్యులున్నారు. 18 మంది సభ్యులున్న ప్రజారాజ్యం, ఏడుగురు సభ్యులున్న మజ్లిస్, ముగ్గురు ఇండిపెండెంట్లు వీరికి మద్దతునిస్తున్నారు. ఈ ప్రకారం కాంగ్రెస్, మిత్రపక్షాలకు ఓటేసే వారి సంఖ్య 184గా లెక్కతేలుతుంది. మిత్రపక్షాలతో కలిపి ఆరుగురు అభ్యర్థులను గెలిపించుకోవడానికి 162 మంది బలం సరిపోతుంది. ఏడో అభ్యర్థిని గెలిపించేందుకు ఇంకా 22 మంది ఎమ్మెల్యేల మద్దతు మిగిలే ఉంటుంది.
అయితే జగన్ వర్గంగా భావిస్తున్న శాసనసభ్యులు కాంగ్రెస్ సూచించిన ప్రకారం ఓట్లేస్తారా లేదా అన్నది తేలడంలేదు. ఇంతవరకూ ఆ వర్గం ఎమ్మెల్యేలు బయటపడడంలేదు. ఆ వర్గం ఎమ్మెల్యేలు కూడా గత రెండు మూడు రోజులుగా ముఖ్యమంత్రిని కలుస్తూనే ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ ఎన్నికల్లో తప్పకుండా తాము సూచించిన మేరకే ఓట్లేస్తారని సీఎం ధీమాగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో గీత దాటినా వారిపై అనర్హతవేటు పడే అవకాశం లేదు. మొత్తం 12 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నందున ప్రతి ఎమ్మెల్యే 12 ప్రాధాన్య ఓట్లను వేయవచ్చు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది.
ఒక్కో ఎమ్మెల్యేకు ఫలానా అభ్యర్థికి మొదటి ప్రాధాన్య ఓటు వేయమని చెప్పి మిగిలిన ప్రాధాన్య ఓట్లను ఎలా వేయాలో వివరిస్తారు. ఇంకా మూడేళ్ళపాటు ప్రభుత్వం అధికారంలో ఉండే పరిస్థితుల్లో ఎమ్మెల్యేలెవరూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడరని పార్టీ విశ్వాసంతో కాంగ్రెసు ఉంది. బిజెపి మద్దతిస్తే తెరాస బలం 13కు పెరుగుతుంది. కాంగ్రెస్‌లో మాదిరే తెదేపాలోను జగన్ వర్గంలోకెళ్ళిన ఇద్దరు, తెరాసతో కలిసి నడుస్తున్న మరో ఎమ్మెల్యే ఓట్లు సందేహంగా ఉన్నాయి. జగన్ వర్గం వ్యూహాత్మకంగా ఎవరికైనా ఓట్లేయిస్తుందా లేక సొంతంగా అభ్యర్ధిని నిలపలేదు కాబట్టి పార్టీ అభ్యర్థులకే ఓట్లేస్తారా అన్నది చర్చనీయాంశమయింది.
జగన్ వర్గం ఎమ్మెల్యేలు మంగళవారం అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై మంతనాలు సాగించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా తమతో నిత్యం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీకి ఓటేసే పరిస్థితి లేదనే అభిప్రాయం వారి మధ్య వ్యక్తమయినట్లు సమాచారం. వైయస్ జగన్ వర్గం తెరాస అభ్యర్థికి ఓటేస్తుందా, కమ్మక్కయ్యారనే విమర్శల నుంచి వెనక్కి తగ్గుతుందా అనేది చెప్పలేం. ఈ స్థితిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పకడ్బందీ వ్యూహాన్ని రచిస్తున్నట్లు సమాచారం.
జగన్ వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ అభ్యర్థులకు ఓటేస్తారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రహస్య కోడ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటేస్తారని ప్రచారం సాగినా కోడింగ్ విధానంతో బయటపడతామన్న ఉద్దేశంతో ఎవరూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదు. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుని ఎమ్మెల్యేలు కట్టు దాటకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.