తర్వాతి టార్గెట్ జగన్ మిత్రుడు గాలి?

తాజాగా వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు అర్జించాడనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో సిబిఐ ప్రాథమిక దర్యాఫ్తు ఇటీవలె ముగిసింది. ప్రాథమిక విచారణలో జగన్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయని, సంపూర్ణ సిబిఐ విచారణకు ఆదేశించడమే తరవాయి మిగిలింది. మైనింగ్ అక్రమాల కారణంగా కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పపై కూడా వేటు పడనుంది. వీరి తర్వాత టార్గెట్ ఎవరంటే పలువురు కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వైపు చేయి చూపిస్తున్నారు!
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సన్నిహితుడు అయిన గాలి జనార్దన్ రెడ్డి కర్నాటకలో కాకుండా మన రాష్ట్రంలోనూ భారీగా అక్రమ మైనింగ్ పనులు చేపట్టినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. లోకాయుక్త సంతోష్ హెగ్డే నివేదికలో యెడ్డీ, కుమారస్వామిలతో పాటు గాలి పేరు సైతం ఉంది. కర్నాటక కేంద్రంగా దక్షిణాదిన బిజెపి పుంజుకునే ప్రయత్నాలను కాంగ్రెసు దెబ్బతీసేందుకు గాలిని తర్వాత టార్గెట్‌గా పెట్టుకోవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
లోకాయుక్త వీరిపై ఇప్పటికే 4వేల పేజీల నివేదిక తయారు చేసింది. నివేదిక తర్వాత గాలిపైనా విచారణకు ఆదేశించే అవకాశాలు మెండుగానే ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు ఇన్నాళ్లూ కాంగ్రెసులో ఉండి ఇప్పుడు అదే కాంగ్రెసును ముప్పు తిప్పలు పెడుతున్న జగన్‌కు గాలి జనార్దన్ రెడ్డితో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. గాలి తమ ప్రత్యర్థి పార్టీ అయిన బిజెపికి చెందిన వాడు కావటంతో పాటు తమను ముప్పు తిప్పలు పెడుతున్న జగన్ కుటుంబ సన్నిహితుడు కావడం అన్నింటికీ మించి దక్షిణాదిన బిజెపిని దెబ్బతీసేందుకు గాలి జనార్దన్ రెడ్డిని తర్వాతి టార్గెట్‌గా పెట్టుకోనున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.












Click it and Unblock the Notifications