వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంపెనీలకు జగన్ కేసు కష్టాలు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వం నుండి మేళ్లు పొంది ఆయన తనయుడు జగన్‌ సంస్థల్లో ఇష్టానుసారం పెట్టుబడులు పెట్టిన బడా కంపెనీలు ఇప్పుడు సీబీఐ సోదాలతో ఠారెత్తి పోతున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పలు కంపెనీలు వాటాదారుల విశ్వాసాన్ని కోల్పోతున్నట్లుగా కనిపిస్తోంది. అవన్నీ కూడా స్టాక్‌మార్కెట్లో నమోదైన కంపెనీలు. ఇలాంటి కంపెనీల యాజమాన్యాలు తీసుకునే ప్రతి నిర్ణయానికి తమ వాటాదార్లకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. జగన్‌ కంపెనీలు, ఆయన వసూళ్ల భాగోతంపై న్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టిన తర్వాత, ఈ లిస్టెడ్‌ కంపెనీల షేర్ల ధరలు వేగంగా దిగజారిపోతున్నట్టుగా కనిపిస్తోంది. తమ భవిష్యత్తును ఫణంగా పెట్టిన కంపెనీల యాజమాన్యాలను.. షేర్లను తెగనమ్మడం ద్వారా స్టాక్‌మార్కెట్లో మదుపుదార్లు శిక్షించడం సాధారణంగా జరిగేదే. ఇదే దుస్థితి ఇప్పుడు జగన్‌తో బాంధవ్యాన్ని పెంచుకున్న లిస్టెడ్‌ కంపెనీలకు ఎదురవుతోంది. కేవలం షేర్‌ ధరల పతనంతో సరిపోయిందా... అంటే అదీ లేదు.

ఆయా కంపెనీల యాజమాన్యాలు న్యాయవిచారణను ఎదుర్కొనాల్సి ఉంది. దీనివల్ల సమీప భవిష్యత్తులో ఈ కంపెనీల వ్యాపారాలూ దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, యాజమాన్యాలు వ్యాపారాన్ని పక్కనబెట్టి సీబీఐ విచారణ, శిక్షల నుంచి బయటపడటం ఎలా అనే దాని మీదే పూర్తిస్థాయి శక్తియుక్తులు కేంద్రీకరిస్తాయని స్టాక్‌మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందువల్ల ఈ కంపెనీల షేర్లలో పెట్టుబడి జోలికి వెళ్లకపోవడమే మేలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నాయి. జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌, భారతీ సిమెంట్‌ కార్పొరేషన్‌ తదితర కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన రాష్ట్రానికి చెందిన లిస్టెడ్‌ కంపెనీలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజి(బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఎస్‌ఈ)లో ఇవి నమోదై ఉన్నాయి. ఇందులో కొన్ని కంపెనీల షేర్లు స్టాక్‌మార్కెట్లో ప్రస్తుతం 52 వారాల కనిష్ట ధర వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. కొద్దికాలంగా ఈ కంపెనీల షేర్ల ధరలు పతనం బాట పట్టాయని తెలుస్తోంది.

ఇంకెంతగా క్షీణిస్తాయో అర్థంకాని పరిస్థితి ఉందని మదుపుదార్లు ఆందోళనకు గురవుతున్నారు. ఊరూపేరూ లేకపోయినా, వ్యాపారం చేస్తున్న దాఖలాలు కానీ, ఆదాయాలు/లాభాలు ఆర్జిస్తున్న స్థితిలోగానీ లేని జగన్‌ సంస్థలలో మరికొన్ని కంపెనీలు కోట్లాది రూపాయిల పెట్టుబడులు పెట్టినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ కంపెనీల షేర్లను అయితే స్టాక్‌మార్కెట్లో అసలు కొనుగోలు చేసే వారే లేనట్టుగా సమాచారం. సాధారణంగా కంపెనీల ప్రతిష్ఠ, యాజమాన్యాల సామర్థ్యానికి స్టాక్‌మార్కెట్లో మదుపుదార్లు ఎంతగానో విలువిస్తారు. ఈ నేపథ్యంలో ఈ కంపెనీలు తమకు అంటిన మరకను తొలగించుకుంటే తప్పించి మళ్లీ మార్కెట్లో విశ్వాసాన్ని పొందడం కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక స్టాక్‌మార్కెట్లో నమోదు కాని రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థలు కొన్ని కూడా వైఎస్‌ హయాంలో భూముల కేటాయింపులు, మినహాయింపులు పొంది దానికి ప్రతిఫలంగా జగన్‌ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి చెడ్డపేరును మూటగట్టుకున్నాయి. ఈ కంపెనీల ప్రతిష్ఠ కూడా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఇందులో కొన్ని అగ్రగామి కంపెనీలుగా కొనసాగుతున్నాయి. అలాంటి వాటి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినట్లు కనిపిస్తోంది.

గత ఏడెనిమిది నెలల కాలంగా ఆర్థిక సంక్షోభం తాలూకు సంకేతాలు అధికంగా ఉన్న విషయం తెలిసిందే. అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, తక్కువ వృద్ధిరేటు, ఎగుమతుల్లో క్షీణత వంటి అనేక సవాళ్లను వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్నాయి. ఇక జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు పులిమీద పుట్రలా ఈ కష్టాలకు తోడు పులిమీద పుట్రలా ప్రతిష్ఠ కోల్పోవడం, న్యాయవిచారణను ఎదుర్కొనాల్సి రావడం మరింత కష్టాలను తెచ్చేలే కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో అటు విచారణను ఎదుర్కొంటూ, ఇటు వ్యాపారాన్ని, ఆదాయాల్ని కాపాడుకుంటూ మళ్లీ మదుపుదార్ల విశ్వాసాన్ని పొందడం ఆయా కంపెనీల యాజమాన్యాలకు కత్తిమీద సామే అవుతుందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆర్థిక నేరాల్ని నియంత్రించడానికి ఏర్పాటైన ఈడి సైతం జగన్ కంపెనీల పెట్టుబడులపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

English summary
It seems, Some companies are in crises, which are invested in YSRC party president YS Jaganmohan Reddy companies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X