చంద్రబాబు వద్ద కెసిఆర్ చిట్టా?

తెరాసను, ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌ను దెబ్బ తీయడానికి ఇదే అనువైన సమయమని భావించిన చంద్రబాబు ఎదురుదాడికి దిగినట్లు భావిస్తున్నారు. తెరాస వల్ల చాలా కాలంగా చంద్రబాబు తెలంగాణలో అడుగు పెట్టలేని స్థితి ఏర్పడింది. తెలుగుదేశం తెలంగాణ నాయకులకు కూడా తెలంగాణలో పర్యటించడం అంత సులభం కావడం లేదు. తెలంగాణ కోసం వారు ఏ ఉద్యమ కార్యక్రమం చేపట్టినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. కెసిఆర్‌ను, తెరాసను నైతికంగా దెబ్బ తీస్తే తప్ప తమ పప్పులు ఉడకవని గుర్తించి, పోలవరం టెండర్ వ్యవహారాన్ని ఆసరా చేసుకుని ఎదురుదాడికి దిగినట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో కెసిఆర్ ఆస్తుల వివరాలు, ఆయన కుటుంబ ఆస్తుల వివరాలు, వారు వసూలు చేసిన డబ్బుల వివరాలు చంద్రబాబు వద్ద ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. చిట్టాను ఆయన మోత్కుపల్లి నర్సింహులు చేతిలో పెట్టినట్లు చెబుతున్నారు. మోత్కుపల్లి నర్సింహులు దళితుడు కావడంతో ఎదురుదాడికి ప్రత్యర్థులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. తెరాసను ఇరకాటంలో పెట్టడానికి మోత్కుపల్లి నర్సింహులు చేత ఆ చిట్టాను చంద్రబాబు బయటపెట్టిస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, తగిన సమయం చూసి మోత్కుపల్లి వాటిని వెల్లడిస్తారని అంటున్నారు. అయితే, చంద్రబాబు ఆస్తుల వివరాలతో వస్తే కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలపై బహిరంగ చర్చకు సిద్ధమని తెరాస నాయకులు సవాల్ విసురుతున్నారు. ఈ సవాల్‌ను తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తుందా అనేది అనుమానమే.












Click it and Unblock the Notifications