జగన్ పార్టీ తర్వాతే చిరు విలీన సభ!

తమపై తిరుగుబాటు చేసి పార్టీ పెడుతున్న జగన్‌కు విలీన సభ ద్వారా గట్టి సమాధానం చెప్పాలనే భావనతో కాంగ్రెస్, చిరంజీవి ఉన్నట్లుగా తెలుస్తోంది. జగన్ పార్టీ ఏర్పాటును పురస్కరించుకుని ఇడుపులపాయలో భారీ బహిరంగసభ నిర్వహణకు ఆ వర్గం సమాయత్తమవుతోంది. అది జరిగిన కొద్దిరోజులకే దానికి దీటుగా ప్రరాపా కాంగ్రెస్‌లో విలీనమయ్యే సభ ఉండాలని ఇటు చిరంజీవి కూడా భావిస్తున్నట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ తర్వాత త్వరలో విలీన సభ ఉంటుందని చిరు చెప్పటంతో ఫిబ్రవరి నెలాఖరులో ఉండవచ్చని పీఆర్పీ నేతలు సైతం చెప్పారు. తాజా పరిణామాలతో విలీన సభ ఏప్రిల్‌లోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. జగన్మోహనరెడ్డి త్వరలోనే కొత్త పార్టీని పెట్టనున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఆ విధంగా చూస్తే ఫిబ్రవరిలోనే ఇది జరగాలి. అయితే ప్రస్తుతం ఆ అవకాశాలు ఏమాత్రం కనిపించడంలేదు.
జగన్ శిబిరం ఎన్నికల సంఘం వద్ద వై.ఎస్.ఆర్.పార్టీ, రామన్న రాజ్యం పార్టీ పేరిట దరఖాస్తు చేసుకుంది. ఆ దరఖాస్తుపై ఎన్నికల సంఘం కొన్ని సాంకేతికమైన అభ్యంతరాలను వ్యక్తంచేయడంతో మళ్ళీ కొత్తగా ప్రక్రియ మొదలుపెట్టాల్సి వచ్చింది. దీని వల్ల తమ పార్టీ ఏర్పాటు ముందుగా అనుకున్న దాని కంటే కొంత ఆలస్యమవుతుందని నేతలు ప్రకటించారు. దీంతో చిరంజీవి కూడా ఉప ఎన్నికలకు ముందు, జగన్ పార్టీ ప్రకటన తర్వాత విలీన సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగూ విలీనం కోసం కిందిస్థాయి నుంచి తీర్మానాలు రావడానికి నెలరోజుల సమయం పడుతుందని ప్రరాపా వర్గాలంటున్నాయి. సభ ద్వారా తన సత్తా చాటుకోవాలని చిరంజీవి కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. తద్వారా జగన్‌కు ఛాలెంజ్ విసిరినట్లవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.