వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ మౌనం వెనక..?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దడదడలాడిస్తానని చెబుతూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావులో ఆ ఊపు లేదనే భావన కలుగుతోంది. తెలంగాణ ఉద్యమం విషయంలో ఆయన ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్న అన్ని వైపుల నుంచి వస్తోంది. అయితే, కెసిఆర్ మాత్రం తరుచుగా వివిధ తెలంగాణ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు, తెలుగుదేశం నాయకులను దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. తన మాటల ద్వారా వివాదాలు సృష్టిస్తూనే ఉన్నారు. కానీ క్రియాశీలక ఉద్యమానికి మాత్రం ముందుకు రావడం లేదనే అభిప్రాయం బలపడుతోంది. దీనికి కూడా ఆయన సమాధానం చెప్పారు. ఉద్యమమంటే విధ్వంసమేనా, ఇది ఉద్యమం కాదా అని అడిగారు. తెలంగాణ జెఎసి మాత్రం ఈ నెల 17వ తేదీ నుంచి సహాయ నిరాకరణకు పిలుపునిచ్చింది. ఇది ఏ మేరకు విజయమవుతుందనే సందేహాలు తెలంగాణవాదుల్లో ఉంది.

శ్రీకృష్ణ కమిటీ తెలంగాణవాదుల ఆశలను వమ్ము చేసింది. అయినా, కెసిఆర్ నుంచి తగిన స్పందన లేదు. ఆయన సున్నితంగానే కమిటీ నివేదికపై ప్రతిస్పందించారు. కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా లేదని కితాబు ఇచ్చారు. కెసిఆర్ తీరు గమనిస్తే ఆయన చల్లపడ్డారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పైగా, ఇటీవల ఆయన కుమారుడు, శాసనసభ్యుడు కెటి రామారావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించేలా చూడాలని తాను ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. కానీ ఆయన మాటలు నమ్మించే విధంగా లేవని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పిన తెరాస నాయకులు ఇతరత్రా డిమాండ్లు పెడతారని ఎవరూ అనుకోవడం లేదు.

కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఏర్పాటు చేయతలపెట్టిన అఖిల పక్ష సమావేశం కూడా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. అయితే, కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై మల్లగుల్లాలు పడుతుండడం వల్లనే సమావేశం ఏర్పాటులో జాప్యం జరుగుతోందని అంటున్నారు. దీనిపై కూడా కెసిఆర్ ఏమీ మాట్లాడడం లేదు. అయితే, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రతిపాదించకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కెసిఆర్ హెచ్చరించారు. ఈలోగా, కెసిఆర్‌ తెరాసను తమ పార్టీలో విలీనం చేసుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెసిఆర్ ఎప్పుడు ఏదైనా చేయవచ్చుననే అభిప్రాయం బలంగానే ఉంది. అందువల్ల తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి ప్రాతిపదికను ఏర్పాటు చేసుకుంటున్నట్లు కూడా భావిస్తున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకంతోనే ఆయన కాంగ్రెసు అధిష్టానానికి కొంత సమయం ఇస్తున్నట్లు కూడా చెబుతున్నారు.

English summary
Why KCR silent on Telangana movement?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X