లగడపాటి ఎందుకు దూరంగా ఉన్నారు?

విజయవాడలో ఏర్పాటైన రౌండ్ టేబుల్ సమావేశానికి చాలా మంది ప్రజాప్రతినిధులు దూరంగా ఉన్నారు. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోదనే ధీమా వల్లనా, పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలనే నిర్ణయం వల్లనా అనేది అర్థం కావడం లేదు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వంటి వారు తాము పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే ప్రకటించారు. శనివారంనాడు డిఎల్ రవీంద్రా రెడ్డి అదే మాట అన్నారు. అంటే, సీమాంధ్ర కాంగ్రెసు ప్రజాప్రతినిధుల్లో ఈ విధమైన మార్పు వచ్చిందా అనేది కూడా చర్చనీయాంశంగానే మారింది.
ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాల నుంచి కేవలం ఒక శాసనసభ్యుడు మాత్రమే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి కాంగ్రెసు, ప్రజారాజ్యం శాసనసభ్యులు కలిపి 27 మంది ఉన్నారు. వారంతా హాజరు కాకపోపడంపై సమైక్యాంధ్ర జెఎసి భగ్గుమంటోంది. వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరిస్తోంది. పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ నియమితులైన తర్వాత సీమాంధ్ర నాయకుల్లో మార్పు వచ్చిందా అనే చర్చ కూడా సాగుతోంది. రాష్ట్ర విభజనకు బొత్స సత్యనారాయణ అనుకూలంగా ఉన్నారు. ఈ ప్రభావం ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులపై పని చేసిందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే.












Click it and Unblock the Notifications