విజయమ్మ వర్సెస్ పరిటాల సునీత

అనంతపురం కోర్టు తీర్పుతో పరిటాల రవి హత్యోదంతం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కేసులో నిందితుడిగా పేరు తొలగించకపోతే వైయస్ జగన్‌కు కూడా శిక్ష పడి ఉండేదని పరిటాల సునీత ఇటీవల అన్నారు. తన భర్త హత్య వెనక అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్ పాత్రలు ఉన్నట్లు ఆమె మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. వైయస్‌ను కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు విమర్సిస్తున్న నేపథ్యంలో సానుభూతిని కూడగట్టుకోవడానికి విజయమ్మ రాజీనామా చేసిన 26 మంది శాసనసభ్యులతో బస్సు యాత్ర చేస్తారని అంటున్నారు. దానివల్ల ఉప ఎన్నికలు జరిగితే తమకు ఇతోధికంగా కలిసి వస్తుందని వైయస్సార్ కాంగ్రెసు వర్గాలు భావిస్తున్నాయి.
వైయస్ విజయమ్మ ప్రచారానికి విరుగుడుగా పరిటాల సునీత ముందుకు వస్తారని అంటున్నారు. తన భర్తను హత్య చేయించిన వైయస్ రాజశేఖర రెడ్డి మహా నాయకుడు ఎలా అవుతాడని సునీత ప్రశ్నించే అవకాశం ఉంది. తనలాంటి వారు ఎంతో మంది పుస్తెలు వైయస్ రాజశేఖర రెడ్డి పుణ్యంతో తెగిపోయాయని ఆమె ప్రచార రంగంలో దూకుడుగా వ్యవహరించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెసు పార్టీ నాయకత్వం వైయస్ విజయమ్మను ఎదుర్కోవడానికి మహిళా మంత్రులను రంగంలోకి దించాలని చూస్తోంది. గీతారెడ్డి, డికె అరుణ, సబితా ఇంద్రా రెడ్డివంటి మంత్రులను తెర మీదికి తెచ్చి విజయమ్మను ఎదుర్కోవాలని అనుకుంటోంది. పులివెందుల ఉప ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లడానికి ఈ మంత్రులు నిరాకరించారు. ఇప్పుడు ఎలా స్పందిస్తారో తెలియదు.












Click it and Unblock the Notifications