చంద్రబాబు కరెక్ట్: జగన్ పార్టీ గుట్టు రట్టు?

చంద్రబాబు ఎంతగా చెప్పినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మాత్రం చంద్రబాబుపై విమర్శలు చేయడం మానుకోలేదు. ప్రభుత్వాన్ని కాపాడే ఉద్దేశంతోనే చంద్రబాబు అవిశ్వాసాన్ని ప్రతిపాదించడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, ఆమె కూతురు షర్మిల పదే పదే విమర్శిస్తూ వచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకటనతో సీన్ రివర్స్ అయింది.
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలు నుంచి బయటకు వచ్చే వరకు తాము అవిశ్వాసం ప్రతిపాదించబోమని, అంత వరకు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏ విధమైన ప్రయత్నాలూ చేయబోమని, జగన్ జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని పడగొడతామని ఆయన అన్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుట్టు రట్టయిందని భావిస్తున్నారు. దీన్ని చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా మలుచుకున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు నాటకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆయన సోమవారం టిడిఎల్పీ సమావేశంలో శాసనసభ్యులకు సూచించారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి తెలుగుదేశం పార్టీని ఉసిగొల్పడం, చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం అనే వ్యూహంతోనే తప్ప వాస్తవంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు అనడం లేదనేది బాలినేని మాటలతో వెల్లడైంది.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో తెలుగుదేశం వ్యూహంలో ఇరుక్కుని వైయస్సార్ కాంగ్రెసు ఆ పార్టీ ప్రతిపాదించిన సవరణ బిల్లుకు మద్దతుగా నిలబడింది. దీంతో మాలలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మొత్తంగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆత్మరక్షణలో పడిన సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications