ఆంధ్రపై సోనియా వర్రీ, రంగంలోకి రాహుల్ గాంధీ

రాష్ట్రంలోని పరిస్థితిని 2014 ఎన్నికలలోగా చక్కదిద్దకపోతే తీవ్రంగా నష్టపోతామని సోనియా గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ గత వారం పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత మంగళవారం రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఆనంద భాస్కర్‌తో భేటీ అయ్యారు. వీరి ద్వారా రాష్ట్రంలోని పరిస్థితిని ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు చెబుతున్నారు. ఆనంద భాస్కర్‌ను స్వయంగా రాహుల్ గాంధీ పిలిపించుకుని మాట్లాడినట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రానికి చెందిన మరి కొంత మంది నాయకులతో కూడా సమావేశమయ్యే అవకాశాలున్నాయి.
పార్టీ పరిస్థితిపై కొద్ది మంది నాయకుల ద్వారా తెలుసుకుని, ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఆయన హైదరాబాద్ సందర్శించే అవకాశాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ సమస్య, వైయస్ జగన్ అంశం, పార్టీలో అంతర్గత విభేదాలు, ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి సోనియాను తీవ్రంగా కలవరపెడుతున్నట్లు చెబుతున్నారు. దాంతో పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరాన్ని గుర్తించి రాహుల్‌ను రంగంలోకి దింపుతున్నట్లు చెబుతున్నారు.
డి. శ్రీనివాస్‌తోనూ ఆనంద భాస్కర్‌తోనూ మాట్లాడిన సోనియా గాంధీ ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. అంతకు ముందు, రాజ్యసభకు ఎన్నకైన చిరంజీవిని, రేణుకా చౌదరిని కూడా ఆమె కలుసుకున్నారు.
డి. శ్రీనివాస్, ఆనంద భాస్కర్ రాష్ట్రంలోని పరిస్థితిని సోనియాకు వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పూర్తి పరిస్థితిని ఆనంద భాస్కర్ సోనియాకు వివరించినట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెసు తరఫున ఆనంద భాస్కర్ గత ఆరేళ్లుగా పార్టీ అధిష్టానానికి నివేదికలు పంపుతున్నారు. ఆయన అవగాహన పట్ల, విశ్లేషణ పట్ల సోనియాకు పూర్తి నమ్మకం ఉందని అంటున్నారు. సోనియాతో మాట్లాడిన తర్వాత వారిద్దరిని రాహుల్ పరిగణనలోకి తీసుకున్నారు. మంగళవారం రాహుల్ గాంధీతో జరిపిన చర్చల వివరాలను ఆనంద భాస్కర్ వెల్లడించడానికి నిరాకరించారు.
మొత్తం మీద, రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్డడానికి సోనియా గాంధీ ముందుకు వస్తున్నట్లు అర్థమవుతోంది. రాహుల్ గాంధీ రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చునని, రాష్ట్రంలోని కాంగ్రెసు పార్టీలో కొందరి పరిస్థితి తారుమారు కావచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications