షర్మిల పోటీ: విశాఖపట్నమా, పులివెందులా?

వచ్చే ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విశాఖపట్నం పార్లమెంటును సొంతం చేసుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటి నుంచి పావులు కదుపుతోందని అంటున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి దగ్దుబాటి పురంధేశ్వరి ఈ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేయడానికి టి. సుబ్బిరామిరెడ్డి కూడా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరికి తిరిగి టికెట్ ఇస్తారా? తెలుగుదేశం పార్టీ తరపున సినీ నటుడు మురళీ మోహన్‌ను బరిలోకి దించాలన్న ఆలోచనలో ఆ పార్టీ ఉన్నటడ్లు చెబుతున్నారు.
ఏ పార్టీ ఎవరిని పోటీకి దించినా విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి షర్మిలను పోటీకి దించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్రను చేవెళ్ల నుంచి ప్రారంభించి, ఇచ్చాపురంలో ముగించారు. షర్మిల తన పాదయాత్రను ఇడుపులపాయలో ప్రారంభించి ఇచ్చాపురంలో ముగించనున్నారు.షర్మిల పాదయాత్రను కూడా విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత విశాఖపట్నం జిల్లాలో పార్టీ నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదు. జిల్లా, మండల, గ్రామ, నియోజకవర్గ స్థాయి కమిటీల ఏర్పాటు కాలేదు. దీంతో ఎవరికి వారు నాయకులుగా ఎదుగుతున్నారే తప్ప, క్యాడర్‌ను ఒక తాటి మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం లేదు. జగన్ జైలుకు వెళ్లిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది.
ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గట్టి పట్టు ఉన్నప్పటికీ, వాటిని ఓట్ల రూపంలో మలిచే వ్యవస్థ పార్టీకి లేకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో షర్మిల పాదయాత్ర మొదలు పెడుతున్నారు. ఈ యాత్రను పార్టీ వర్గాలు ఆహ్వానిస్తున్నాయి. క్యాడర్‌లో ఉత్సాహం కూడా పెరిగింది.