వైయస్: మూడేళ్లైనా రాజకీయాలు ఆయన చుట్టూనే

YS Rajasekhar Reddy
వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెంది మూడేళ్లు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలు ఇంకా ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి! వైయస్ మృతి చెందాక ఆయన తనయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని సంతకాల సేకరణ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో రాజకీయాల్లో పరోక్షంగా వైయస్ కనిపిస్తున్నారు. నిత్యం కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు సమర్థిస్తూనే, వ్యతిరేకిస్తూనో ఆయన పేరును పలుకుతున్నాయి.

వైయస్ మృతి చెందాక జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని సంతకాల సేకరణ జరిగింది. 155 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు. అయితే అధిష్టానం మాత్రం జగన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు ససేమీరా అంది. అప్పటి నుండి రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. జగన్‌ను కాకుండా కొణిజేటి రోశయ్యను అధిష్టానం ముఖ్యమంత్రిగా చేసింది. రోశయ్యను పలువురు నేతలు అంగీకరించలేదు. అప్పటి మంత్రి కొండా సురేఖ ఏకంగా తాను రోశయ్య కేబినెట్లో పని చేయనని చెప్పి రాజీనామాకు కూడా సిద్ధపడింది.

జగన్‌ను సిఎంగా చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. ఢిల్లీ వరకు ఈ వేడి తాకింది. అయితే అప్పుడు ఢిల్లీ పెద్దలు జగన్‌ను ఇంతలా ఎదుగుతాడని అంచనా వేయలేకపోయి ఉంటారు! అందుకే అతనికి చల్లగా నచ్చ చెప్పే ప్రయత్నాలు చేశారని అంటుంటారు. పార్టీలో ఉంటూనే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు. తన తండ్రి మృతిని తట్టుకోలేక చనిపోయిన వారిని ఓదార్చుతాననని తాను నల్లకాల్వ వద్ద హామీ ఇచ్చానని చెప్పిన జగన్ అధిష్టానం మాటను బేఖాతరు చేస్తూ ఓదార్పుకు సిద్ధపడ్డారు.

ఓదార్పు వద్దని ఢిల్లీ పెద్దలు చెప్పినప్పటికీ జగన్ మాత్రం తగ్గలేదు. ఈ పరిణామాలు కాంగ్రెసుకు జగన్‌ను మరింత దూరం చేశాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు జగన్ కాంగ్రెసు పార్టీని వీడారు. తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన తల్లితో కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్వతంత్రంగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపించారు. ఓ వైపు రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తూనే మరోవైపు ఓదార్పు యాత్రను కొనసాగించారు.

నిత్యం ప్రజల్లో ఉండటం, వైయస్ పైన ఉన్న అభిమానం తదితర కారణాల వల్ల ప్రజల్లో జగన్ పట్ల అనుకూలత ఏర్పడింది. దానిని జగన్ ఓట్ల రూపంలోకి కూడా మార్చుకున్నాడు. ముఖ్యమంత్రి పదవి దక్కలేదనే జగన్ పార్టీని వీడాడని కాంగ్రెసు విమర్శలు ప్రారంభించింది. జగన్ కూడా అందుకు ధీటుగానే స్పందించారు. తనకు సిఎం పదవిపై ఆశ ఉంటే 155 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినప్పుడే అయ్యే వాడనని, తన తండ్రి తర్వాత కాంగ్రెసు పార్టీ వైయస్ కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శలు గుప్పించారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు రెండూ వైయస్ తమ వాడంటే తమ వాడని విమర్శించుకునే స్థాయికి చేరుకున్నాయి. అయితే క్రమంగా కాంగ్రెసు తీరులో మార్పు వచ్చింది. వైయస్ పేరుతో ఏది చేసినా అ క్రెడిట్ జగన్‌కు దక్కుతున్నదని గ్రహించి... వైయస్‌ను పక్కకు పెట్టాలని భావించింది. అది అధికారికంగా కాకుండా అనధికారికంగా చేయాలని చూసింది. అయితే పార్టీలోని పలువురు నేతలు వైయస్ పేరును పక్కన పెట్టాలని చూడటాన్ని బహిరంగంగా తప్పు పట్టారు. విహెచ్, మధుయాష్కీ వంటి మరికొందరు నేతలు మాత్రం వైయస్‌ను జగన్ పార్టీకి వదిలేస్తేనే కాంగ్రెసు బాగుపడుతుందని చెప్పుకొస్తున్నారు.

ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా జగన్ తన తండ్రి హయాంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. వైయస్ ఇందుకు కారకుడని చెబుతూ వస్తోంది. వైయస్ లేకుండే జగన్ ఇన్ని అక్రమాలకు పాల్పడి ఉండే వాడు కాదని చెబుతూ.. వైయస్ హయాంలోని అక్రమాలను ప్రెస్ మీట్‌లలో ఏకరువు పెడుతూ వస్తోంది. కాంగ్రెసు, టిడిపి జగన్‌ను టార్గెట్ చేసుకొని ప్రజల మధ్యకు వెళ్లడం మర్చిపోయాయి! అదే సమయంలో జగన్ మాత్రం ఓదార్పు యాత్ర, దీక్షలు, ధర్నాల పేరుతో జనంలో ఉండిపోయారు.

దీంతో కాంగ్రెసు, టిడిపిలకంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభావం రాష్ట్రంలో ఎక్కువగా కనిపించింది. అందుకు వైయస్ పై ఉన్న అభిమానం తదితరాలు జగన్‌కు కలిసి వచ్చాయి. జగన్ ఊరూరా వైయస్ విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఓదార్పు నిర్వహిస్తున్నారు. ఆయన విగ్రహాల అంశం కూడా రాజకీయం పులుముకుంది. జగన్ రాజకీయ దురుద్దేశ్యంతోనే వైయస్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని, అక్రమ విగ్రహాలను తొలగించాలని టిడిపి, కాంగ్రెసులోని కొందరు నేతలు ఘాటుగానే స్పందించారు.

జగన్ ఎఫెక్ట్ టిడిపి, కాంగ్రెసులపై బాగానే పడింది. పెద్ద ఎత్తున నేతలు ఇరు పార్టీల నుండి జగన్‌కు జై కొట్టారు, కొడుతున్నారు. ఉప ఎన్నికలలో జగన్ పార్టీ ఘన విజయం సాధించడం కూడా ఇరు పార్టీ నేతలను సందిగ్ధంలో పడిసింది. తెలంగాణలోనూ ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితికి జగన్ పార్టీ ముచ్చెమటలు పట్టించింది. జగన్ జైలుకు వెళ్లాక జరిగిన ఈ ఉప ఎన్నికల భారం వైయస్ విజయమ్మ, షర్మిల తమ భుజాల మీద వేసుకున్నారు.

వైయస్ హెలికాప్టర్ ప్రమాదం అంశం ఈ ఉప ఎన్నికలలో ప్రధాన భూమిక పోషించింది. ఈ వ్యాఖ్యల కారణంగానే జగన్ పార్టీ భారీ మెజార్టీతో గట్టెక్కిందనే అభిప్రాయాలు ఉన్నాయి. జగన్ కాంగ్రెసును వీడి బయటకు వెళ్లడం, వైయస్ ఇమేజ్ ఆయన సొంతం అవుతున్న సమనయంలోనే జగన్ ఆస్తుల పైన సిబిఐ విచారణ ప్రారంభమైంది. అయితే సిబిఐ విచారణ జగన్‌కు మరింత సానుభూతి తెచ్చి పెట్టింది తప్ప అతని పార్టీకి ఎలాంటి నష్టాన్ని చేకూర్చలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపి, కాంగ్రెసులకంటే జగన్ పార్టీయే బలంగా ఉంది. అప్పట్లోని వైయస్ వ్యతిరేకులు కూడా జగన్ వైపుకు వెళుతుండటం విశేషం. వైయస్ బద్ద శత్రువుగా ముద్రపడిన స్వర్గీయ పిజెఆర్ తనయ విజయా రెడ్డి జగన్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేబినెట్లో కూడా ఏడుగురు జగన్ కోవర్టులున్నారనే అంశం కాంగ్రెసును కలవరపెడుతోంది. మొత్తానికి వైయస్ మృతి తర్వాత అన్ని పార్టీలు కూడా సమర్థిస్తూనో వ్యతిరేకిస్తూనో ఆయన పేరునే పలవరిస్తున్నాయి.

ఒక్క వైయస్ మృతి వల్ల రాష్ట్ర రాజకీయాలు తీవ్ర సంక్షోభంలో పడటం గమనార్హం. వైయస్ తర్వాత కాంగ్రెసులో ఎప్పుడు ముఖ్య నేతల మార్పులపై ఊహాగానాలు, ప్రభుత్వం పడిపోతుందని ప్రచారాలు ఆ పార్టీ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. భయమో లేక గౌరవమో ఏదైనా వైయస్ ఉన్నప్పుడు కాంగ్రెసులో ఒకరిద్దరు నేతలు తప్ప అందరూ మౌనంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఏ నాయకుడు ఎప్పుడు ఎలా మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏకంగా ముఖ్యమంత్రి పైనే సొంత పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేసే స్థాయికి పరిస్థితి దిగజారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+