బాలయ్య: టిడిపిలో రెండో పవర్ సెంటర్

పార్టీలో తగిన స్థానం కోసం ప్రయత్నించేవారు బాలయ్యతో ముందుకు నడవాలని అనుకుంటున్నారు. తాజాగా, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టికెట్ల కోసం బాలయ్యను ఆశ్రయించే వారి సంఖ్య పెరిగినట్లు చెబుతున్నారు. శానససభ్యులో కోటాలో మార్చి 21వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. పది స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
శానససభలో ఉన్న బలాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ రెండు సీట్లను కచ్చితంగా గెలుచుకుంటుంది. కాస్తా కష్టపడితే మూడో సీటు దక్కే అవకాశాలున్నాయి. ఈ మూడు సీట్ల కోసం తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. తమ విభాగం అధ్యక్షురాలు శోభా హైమవతి ఎమ్మెల్యే టికెట్ వచ్చేలా చూడాలని తెలుగు మహిళ నాయకురాళ్లు శుక్రవారం బాలయ్యను కలిసి కోరారు. శోభా హైమవతికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి పెట్టాలని వారు బాలయ్యకు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్, దాడి వీరభద్ర రావుల పదవీ కాలం ముగుస్తోంది. తమకు మరో అవకాశం ఇవ్వాలని వారిద్దరు చంద్రబాబును కోరుతున్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం, పంచుమర్తి అనురాధ, వేం నరేందర్ రెడ్డి, కవిత వంటి నాయకులు కూడా ఎమ్మెల్సీ సీట్ల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. మైనారిటీ వర్గానికి చెందిన కలామ్, కరీం కూడా రేసులో ఉన్నారు. తనకు టికెట్ ఇస్తే మజ్లీస్ శాసనసభ్యుల మద్దతు కూడా సంపాదిస్తానని కలామ్ చంద్రబాబుకు చెబుతున్నట్లు సమాచారం.
మొత్తం మీద, బాలకృష్ణ మాట కూడా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో చెల్లుబాటు అయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. పార్టీని తిరిగి అధికారంలోకి తేవడంలో బాలకృష్ణ పాత్ర గణనీయంగా ఉంటుందని, దానివల్ల చంద్రబాబుకు బాలయ్య మాట వినాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా బాలకృష్ణ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications