వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశ: 'టీ'కి సోనియాపై, సీమాంధ్రకు రాహుల్‌పై

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపైనే ఆశలు పెట్టుకున్నారు. విభజనకు రాహుల్ గాంధీ సుముఖంగా లేరనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వారికి ఆయన పట్ల ఆశలు పెరిగాయి. రాష్ట్రాన్ని విభజించకూడదని పలువురు సీమాంధ్ర నేతలు, కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీని కలిసి కోరారు.

ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా రాహుల్ గాంధీ అభిప్రాయాన్ని బలపరుస్తున్నట్లు, మన్మోహన్ సింగ్ చిన్న రాష్ట్రాల ఏర్పాటను వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో పలు మార్లు మన్మోహన్ సింగ్ చిన్న రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించారు. చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి ఆటంకంగా మారుతాయనేది ఆయన ఉద్దేశ్యం.

తెలంగాణపై హడావిడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత ఏమీ లేదని రాహుల్ గాంధీ ఇటీవల ఓ సీమాంధ్ర నాయకుడితో అన్నట్లు ప్రచారం సాగుతోంది. నిజంగానే తెలంగాణ సెంటిమెంట్ ఉంటే అది వచ్చే ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని, అలా 2014 ఎన్నికల్లో అది ప్రతిఫలిస్తే తెలంగాణపై నిర్ణయం తీసుకోవచ్చునని రాహుల్ గాంధీ అన్నట్లు ప్రచారం సాగుతోంది.

Rahul Gandhi and Sonia Gandhi

గత మూడు రోజులుగా పలువురు సీమాంధ్ర నాయకులు రాహుల్ గాంధీని కలిశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఎదురయ్యే సమస్యలను వారు ఆయనకు వివరించినట్లు సమాచారం. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌ను కూడా కలిశారు. రాష్ట్రాన్ని విభజించకూడదని వారు వేడుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం సిద్ధమైందని తెలంగాణ కాంగ్రెసు నాయకులు నమ్ముతుండగా, 2014 ఎన్నికల లోపు విభజన జరగదని సీమాంధ్ర నాయకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా సీమాంధ్ర నాయకులకు అదే హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తెలంగాణ కాంగ్రెసు నాయకులు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై విశ్వాసం పెట్టుకోగా, సీమాంధ్ర నాయకులు రాహుల్ గాంధీపై అశలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే గులాం నబీ ఆజాద్ రాయల తెలంగాణ ప్రతిపాదనను తెర మీదికి తెచ్చినట్లు చెబుతున్నారు.

రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మజ్లీస్‌తో పాటు కాంగ్రెసులోని మైనారిటీ నాయకులు మద్దతు పలుకుతున్నారు. దీంతో ఆజాద్ ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతంతో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపితే కాంగ్రెసుకు ప్రయోజనం కలుగుతుందని వారు చెప్పినట్లు సమాచారం. తాజాగా కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన దిగ్విజయ్ సింగ్ రాయల తెలంగాణ ప్రస్తావన తేవడం లేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమా, తెలంగాణ ఏర్పాటు చేయడమా అనే రెండు ప్రతిపాదనలున్నాయని ఆయన చెప్పారు.

English summary
Seemandhra Congress leaders have placed their hopes on AICC vice-president Rahul Gandhi who is opposing the division of the state to block the formation of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X