కిరణ్ రెడ్డి టీ లీకులు: జంకుతున్న నేతలు

సంగారెడ్డి కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మినహా తెలంగాణకు చెందిన కాంగ్రెసు నేతలు కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా మాట్లాడడానికి జంకుతున్నారు. అంతేకాకుండా కిరణ్ కుమార్ రెడ్డిని కలవడానికి కూడా వారు ఇష్టపడడం లేదని అంటున్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన తెలంగాణ మంత్రులు కూడా ఇప్పుడు ఆయనను కలవడానికి భయపడే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి కోర్ గ్రూప్ సమావేశంలో వివరించిన విషయాలు కాంగ్రెసు తెలంగాణ నేతలకు మింగుడపడడం అటుంచి, ఆయనను కలిస్తే తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేయించుకోవాల్సి వస్తుందనే ఆందోళనతో వారు సతమతమవుతున్నారు. తెలంగాణ ఉద్యమ వేడి ఎంతగా ఉన్నా కూడా గతంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్, సునీతా లక్ష్మారెడ్డి, గీతా రెడ్డి వంటి పలువురు మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి వెంట నడిచారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
తెలంగాణపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, తెలంగాణ తమ చేతుల్లో లేదని, కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిందేనని చాలా కాలంగా కిరణ్ కుమార్ రెడ్డి వాదిస్తూ వచ్చారు. కానీ, తన అభిప్రాయం చెప్పాల్సి వచ్చేసరికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించారని అంటున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెసు నేతలు కిరణ్ కుమార్ రెడ్డికి దూరమవుతున్నారని అంటున్నారు. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి వాదనలను ఆయనకు అత్యంత సన్నిహితుడైన గండ్ర వెంకటరమణా రెడ్డివంటివారు కూడా వ్యతిరేకిస్తున్నారు.












Click it and Unblock the Notifications