ఆఫర్: మోడీకి పట్టని బాబు, జయలలిత మౌనం!
హైదరాబాదులోని నవ భారత యువ భేరీలో ప్రసంగించిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేరును ఎక్కడా ప్రస్తావించకుండా తెలుగుదేశం పార్టీని ఆహ్వానించడం గమనార్హం! అదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలితపై పొగడ్తల వర్షం కురిపించారు.
ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన నవ భారత యువ భేరీ సభలో మోడీ ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ఆయన తెలుగు వారిని ఆకట్టుకునేలా ప్రసంగం చేశారు. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోడీ ఆ తర్వాత సీమాంధ్ర, తెలంగాణ ప్రజలకు సమ ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పడమే కాకుండా స్వర్గీయ నందమూరి తారక రామారావు పైన పొగడ్తల వర్షం కురిపించారు.

ఎన్టీఆర్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని, కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలో ఆయన వల్లే మొదట సాధ్యమైందని కితాబిచ్చారు. కాంగ్రెసు వ్యతిరేక కూటమిని ఆయన బలోపేతం చేశారన్నారు. కాంగ్రెసు నుండి భారత దేశానికి విముక్తి కలిగించడమే ఎన్టీఆర్‌కు సరైన నివాళి అని మోడీ అన్నారు. తద్వారా టిడిపిని ఆయన ఎన్డీయేలోకి స్వాగతించారు.
బాబు గురించి మాట్లాడని మోడీ జయలలిత పైన ప్రశంసలు కురిపించారు. గుజరాత్‌కు ఎవరైనా వ్యతిరేకమైతే, అక్కడి అభివృద్ధి గురించి మాట్లాడటం ఇష్టం లేకుంటే తమిళనాడును ఉదాహరణగా చూడవచ్చునన్నారు. అక్కడ ఎంతో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు.
కాగా, బిజెపితో జత కట్టేందుకు తెలుగుదేశం పార్టీలో భిన్న వాదనలు ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ టిడిపి నేతలు ఆ పార్టీతో జత కట్టేందుకు ఆసక్తి చూపిస్తుండగా, సీమాంధ్ర నేతలు మాత్రం ససేమీరా అంటున్నారు. చంద్రబాబు కూడా మైనార్టీల ఓట్ల కోల్పోకుండా ఉండేందుకు ఆ పార్టీకి దూరంగా ఉండటమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారు.
ఇక జయలలిత విషయానికి వస్తే ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 2014 ఎన్నికల నేపథ్యంలో కొత్త ఫ్రంట్ కోసం ఆలోచన చేస్తూనే, బిజెపితో పొత్తుకు కూడా దూరం జరగడం లేదని చెప్పవచ్చు. ఆమె బిజెపికి దూరంగా లేదా దగ్గరగా ఉండటం లేదు. ఎన్నికల ఫలితాల సరళిని అనుసరించి ఆమె ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. అయితే యూపిఏకి మాత్రం మద్దతిచ్చే అవకాశాలు మాత్రం లేవంటున్నారు.












Click it and Unblock the Notifications