జగన్ పార్టీతో కాంగ్రెసు రహస్య మంతనాలు?

కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్‌ల మధ్య ఢిల్లీలో రహహ్య మంతనాలు సాగుతున్నాయని తెలుగుదేశం శాసన సభాపక్షం ఉప నాయకుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తాజాగా ఆరోపించారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఒకే తాను ముక్కలని వాయలార్ రవి వ్యాఖ్యలతో స్పష్టమైందని వారన్నారు. కాంగ్రెస్‌తో కలిస్తేనే బెయిల్ వస్తుందనే ఉద్దేశంతో రెండు పార్టీల మధ్య మంతనాలు సాగుతున్నాయని అన్నారు. ఈ రెండు పార్టీలు ఎప్పుడైనా కలిసి పోతాయని అన్నారు. రెండు పార్టీల నాయకులు పైకి విమర్శలు చేసుకుంటున్నా, రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారని విమర్శించారు.
వాయలార్ రవి మాట్లాడుతున్న మాటలు ఇరు పార్టీల మధ్య చర్చల్లో భాగమేనని యనమల రామకృష్ణుడు తెలిపారు. సంతకాల సేకరణ సిడిని రాష్టప్రతికి ఇచ్చే పేరుతో విజయమ్మ ఢిల్లీ వెళ్లి రాష్టప్రతిని కలిసిన నాలుగు రోజులకే వాయలార్ నుంచి ఇలాంటి ప్రకటన వెలువడడం గమనార్హం అని యనమల తెలిపారు. వైయస్ విజయమ్మ, భారతి, షర్మిల పదే పదే ఢిల్లీ చుట్టు తిరగుతూ హై కమాండ్‌తో రాయబారాలు నడుపుతున్నారని అన్నారు.
కడపకు ఢిల్లీకి మధ్య పోటీ అంటూ ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించారని అన్నారు. ఎన్నికల్లో గెలిచాక యుపిఏకు మద్దతు ఇస్తామని ఆ పార్టీ తెలిపిందని యనమల చెప్పారు. ఆ ఒప్పందంలో భాగంగానే రాష్టప్రతి ఎన్నికల్లో, స్పీకర్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు కాంగ్రెస్‌కు ఓటు వేశారని యనమల ఆరోపించారు. సెప్టెంబర్ 22, 2012లో విజయసాయిరెడ్డి ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో రహస్యంగా మంతనాలు సాగించారని తెలిపారు.
తమ పార్టీ కేంద్రంలో యుపిఎతో కలిసి పనిచేసే అవకాశాలున్నాయని వైయస్ జగన్ తన అరెస్టుకు ముందు పలుమార్లు చెప్పారు. బిజెపితో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైతే జగన్ సహాయం తీసుకునే ఉద్దేశంతోనే కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications