ఇతర డిమాండ్లు సాకు: తెలంగాణకు ఆజాద్ కొర్రీ

కోర్ కమిటీ సమావేశం నుంచి శుక్రవారం సాయంత్రం రాష్ట్ర నేతలు ముగ్గురూ వెళ్ళిపోయిన తర్వాత పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కమిటీ సభ్యుల అభిప్రాయాలు కోరినట్లు సమాచారం. రక్షణ మంత్రి ఆంటొనీ, గులాం నబీ ఆజాద్ విడివిడిగా తమ అభిప్రాయాలు తెలియజేశారని అంటున్నారు. ముగ్గురు నేతల వాదనల విషయంలో అనుమానాలు, అభ్యంతరాలూ వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వాదనలు పూర్తిగా వాస్తవమేనా అనే అనుమానం ఒకటైతే, వాటిపైనే ఆధారపడి, విశ్వసించి నిర్ణయం తీసుకోరాదనే అభిప్రాయం చెప్పినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రం ఇస్తే పార్టీ బాగు పడుతుందని, ఈ ప్రాంతం నుంచి 15 మంది లోక్‌సభ సభ్యులను గెలిపిస్తామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ చేసిన వాదనపై కాసేపు చర్చ జరిగిటనట్లు తెలుస్తోంది. దామోదర చెప్పిన దాన్ని ఆధారం చేసుకుని తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే కొత్త పేచీలు తలెత్తుతాయన్న అభిప్రాయాన్ని ఆంటొనీ, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.
ఇప్పటికే బోడో ల్యాండ్, గోర్ఖాల్యాండ్, విదర్భ లాంటి డిమాండ్లు ఉన్నాయని, తెలంగాణ ఇస్తామని ఇప్పటికిప్పుడు చెప్పేస్తే మిగిలిన రాష్ట్రాలలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారు అవుతుందని షిండే తదితరులు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఒక చోట లాభం కలుగుతుందని చూసుకుంటే, నాలుగైదు చోట్ల ఎదురుదెబ్బ తగులుతుందని, అలాంటప్పుడు ఒక చోట నష్టానికే సిద్ధపడితే సరిపోతుందన్న అభిప్రాయమూ వ్యక్తమైనట్లు సమాచారం. సోనియా జోక్యం చేసుకొని, ఇది సున్నితమైన అంశమని, అంత సులభంగా తీసివేయదగినది కాదని, ఆచి తూచి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని చెప్పినట్టు తెలిసింది.
సమస్యను మరి కొంతకాలం సాగదీస్తే ఇబ్బందేమీ లేదని, తెలంగాణ ఇచ్చేది లేదన్న సంకేతాలు ఎలాగూ ఇవ్వలేదు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ నేతలను బుజ్జగించటం పెద్ద ఇబ్బందేమీ కాదనే అభిప్రాయాన్ని ఆజాద్ వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. స్థానిక ఎన్నికలు ముగిసే దాకా దీనిపై ఇలాగే తర్జన భర్జనలకు చోటు కల్పించి వదిలేస్తే ఆ తర్వాత చూసుకోవచ్చునన్న అభిప్రాయంతో సోనియా ఏకీభవించినట్టు చెబుతున్నారు. నిర్ణయం తీసుకోలేదు కాబట్టి సమైక్యాంధ్ర వాదుల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాబోదని, ఒకవేళ అక్కడక్కడ అలకలు పుట్టినా వాటిని చక్కదిద్దవచ్చునన్న అభిప్రాయానికి సమావేశం వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications