ఎమ్మెల్సీలో ఒకటా రెండా?: జగన్ 'ఆకర్ష్' డైలామా!

ఎమ్మెల్సీ ఎన్నికలకు విప్ వర్తించదు. దీనిని సద్వినియోగం చేసుకొని ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అవసరమైతే రెండు స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలనే యోచనలో జగన్ పార్టీ ఉందట. టిడిపి, కాంగ్రెసు నుండి ఇప్పటి వరకు పన్నెండు మంది ఎమ్మెల్యేలు జగన్ వైపుకు వెళ్లారు. వీరు జగన్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేసినా వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైన 29 ఓట్లు ఉంటాయి.
అవసరమైనవే కాకుండా మరో రెండు ఓట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. మరికొందరు టిడిపి, కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు తమ వైపుకు వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎప్పటి నుండో చెబుతోంది. అలాంటి వారిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపయోగించుకోవడంతో పాటు మరికొందరు ఇతర పార్టీల నేతలను తాము నిలబెట్టే అభ్యర్థికి ఓటు వేసేలా లాబీయింగ్ చేస్తే మరో ఎమ్మెల్సీ కూడా తమ ఖాతాలో పడుతుందని వారు భావిస్తున్నారు.
ఇప్పటికే తమ వైపుకు వచ్చిన వారితో ఒక సీటు దాదాపు ఖాయమవనున్న నేపథ్యంలో ఇప్పుడు రెండో సీటు పైన ఆ పార్టీ దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరికొందరు ఎమ్మెల్యేలను ఓటు ద్వారా ఉపయోగించుకోవడం ద్వారా వారు తమ వైపు ఉన్నారని చెప్పవచ్చునని తద్వారా టిడిపి, కాంగ్రెసులలో అలజడి సృష్టించే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారట.
తెలంగాణా? సీమాంధ్రా?
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఏ ప్రాంతం వారిని బరిలోకి దింపాలనే విషయంపై కూడా తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతం నుంచి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించిన అనంతరం అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఒక్కరు అయితే తెలంగాణ ఇద్దరైతే తెలంగాణ, సీమాంధ్రల నుండి ఒక్కరొక్కరిని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications