నాగాలాండ్ సీఎం కోసం ట్విస్ట్: మహిళా రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనకు మద్దతు
శాన్య రాష్ట్రాల్లో ఆర్థిక దిగ్బంధాలు, వేర్పాటువాద సంస్థల ఆందోళనలు కొత్తేమీ కాదు. పర్వత శ్రేణుల మధ్య విసిరేసినట్లు ఉండే గ్రామాలు, పట్టణాల మధ్య సౌకర్యాలు, వసతులకు దూరంగా ఉంటాయి.
కొహిమా/గౌహతి : ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్థిక దిగ్బంధాలు, వేర్పాటువాద సంస్థల ఆందోళనలు కొత్తేమీ కాదు. పర్వత శ్రేణుల మధ్య విసిరేసినట్లు ఉండే గ్రామాలు, పట్టణాల మధ్య సౌకర్యాలు, వసతులకు దూరంగా ఉంటాయి.
ఈ పరిస్థితులను రాజకీయ నాయకులు, వేర్పాటు వాద సంస్థల అధినేతలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సుదీర్ఘకాలం ఆర్థిక దిగ్బంధాలు, నిరసనలకు దిగడం సహజ పరిణామమే.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నాగాలాండ్‌లో పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వర్తింపజేసేందుకు సీఎం టీఆర్ జెలియాంగ్ తీసుకున్ననిర్ణయానికి వ్యతిరేకంగా గిరిజన సంఘాలు ఆర్థిక దిగ్బంధానికి దిగాయి.
వారి ఆందోళన హింసాత్మకంగా మారి ఈనెల ఒకటో తేదీన పోలీసుల కాల్పుల్లో ఇద్దరి మరణానికి కూడా దారి తీసింది. దీని సాకుగా రాష్ట్ర ప్రభుత్వ సారథి మార్పు కోసం నాగాలాండ్ ట్రైబల్ యాక్షన్ కమిటీ (ఎన్‌టిఎసి) ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి.

బీజేపీ, ఎన్‌పిఎఫ్ ఆధ్వర్యంలో డీఎఎన్ కూటమి
తమిళనాడు ‘రిసార్ట్' క్యాంపు రాజకీయాలు నాగాలాండ్‌కు కూడా పాకాయి. అధికారంపై ఆశలు, ఆకాంక్షలు ప్రజలను ఎంతటి ఇబ్బందులు పెట్టేందుకైనా వెనుకాడబోవని నాగాలాండ్ పరిణామాలు చెప్తున్నాయి. నాగాలాండ్‌లోని బీజేపీ, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ కలిసి నాగాలాండ్ ప్రజాస్వామ్య కూటమి (డీఎఎన్) పేరిట కూటమి ఏర్పాటు చేశాయి. కూటమి ఆధ్వర్యంలో సమావేశమైన 42 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుత సీఎం జెలియాంగ్ స్థానే అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్) అధ్యక్షుడు షురోజెలీ లీజెయిట్స్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. కానీ నాగాలాండ్ లోక్‌సభ సభ్యుడు - మాజీ సీఎం నెయిఫియు రియో మరోసారి సీఎం పదవి చేపట్టేందుకు ఆరాటపడుతున్నారని విశ్వసనీయ సమాచారం.

ఎన్‌ఫిఎఫ్ ఎమ్మెల్యేలు ఇలా..
తమిళనాట అధికార అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ నటరాజన్‌కు వ్యతిరేకంగా ప్రస్తుత మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు తెర వెనుక నుంచి మద్దతునిచ్చినట్లే.. నాగాలాండ్‌లోనూ తమకు అనుకూలమైన నేతగా ఎన్‌పిఎఫ్ ఎంపి నెయిఫియు రియోను సీఎంగా నిలబెట్టి ప్రభుత్వాన్ని కూర్చుండబెట్టాలని బీజేపీ తెర వెనుక రాజకీయాలు చేస్తున్నట్లు అధికార ఎన్‌పిఎఫ్ నేత ఒకరు తెలిపారు. దీనిపై ఏకాభిప్రాయం సాధించేందు కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా రాష్ట్రం బయటికి వెళ్ళి అస్సోంలోని కాజీరంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని రిసార్ట్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

2014లో సీఎంగా జెలియాంగ్ బాధ్యతల స్వీకరణ
నెయిఫియు 2014లో రాష్ట్ర సీఎంగానే లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించిన తర్వాత జెలియాంగ్‌కు ప్రభుత్వ పగ్గాలు అప్పగించి పార్లమెంట్‌కు వెళ్లిపోయారు. కానీ కేంద్ర క్యాబినెట్‌లో బెర్త్ లభిస్తుందన్న ఆయన ఆశలు అడియాసలు కావడంతో తిరిగి సీఎంగా వెనుకకు రావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచే నెయిఫియుకు, జెలియాంగ్ మధ్య విభేదాలు పెరిగిపోయాయని తెలుస్తోంది. అందుకు సరైన అవకాశం ఎదురుచూస్తున్న ‘రియో'.. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పనకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారని సమాచారం.

కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత మధ్య రాజీ ఇలా..
42 మంది ఎన్ పిఎఫ్ ఎమ్మెల్యేలు, నలుగురు బీజేపీ, 8 మంది స్వతంత్ర్య అభ్యర్థులు ఉన్నారు. సీఎం టీఆర్ జెలియాంగ్‌కు, మాజీ సీఎం నెయ్‌ఫియు రియో మధ్య ఒప్పందం కుదిర్చేందుకు బిజెపి కేంద్ర నాయకత్వం తెర వెనుక నుంచి ప్రయత్నిస్తున్నదని ఎన్‌పిఎఫ్ నేత ఒకరు పేర్కొన్నారు. కేంద్రంలో పీఎంవో వ్యవహారాలశాఖ మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌లతో జెలియాంగ్, రియో సమావేశమైనట్లు తెలుస్తోంది. గవర్నర్ పీబీ ఆచార్యతోపాటు సీఎం జెలియాంగ్ ఒకేసారి ఢిల్లీ వెళ్లడం యాద్రుచ్ఛికమైనా జెలియాంగ్‌తో కుదిరిన ఒప్పందం మేరకు రియో ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు సమాచారం.

ఇలా కాజీరంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో..
ప్రస్తుతం కాజీరంగా వన్య ప్రాణి సంరక్షణ కేంద్రంలోని రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలకు నాగా పీపుల్స్ ఫ్రంట్ అధ్యక్షుడు షురోజెలీ లీజెయిట్స్ సారథ్యం వహిస్తున్నారు. గవర్నర్ పీబీ ఆచార్య రాష్ట్రంలో లేకున్నా ప్రజాస్వామిక కూటమి శాసనసభాపక్షం రెండు రోజుల క్రితం కోహిమాలోని రాజ్ భవన్‌కు ఓ లేఖను సమర్పించింది. నాగాలాండ్ తదుపరి సీఎంగా లీజిట్సూకు తమ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారని ఆ లేఖలో తెలిపారు. జెలియాంగ్ నాగా తెగకు చెందిన టీఆర్ జెలియాంగ్ రాష్ట్ర మంత్రిగా చేశారు. రాజ్యసభ సభ్యునిగా కూడా ఆయనకు అనుభవం ఉంది. గత ఏడాది రియోను, కొందరు ఎన్‌పీఎఫ్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాంఘిక అనిశ్చిత పరిస్థితులకు కారణం రియో అని చాలా మంది భావిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications