జపాన్ రెంకోజీ ఆలయంలో చితాభస్మం నేతాజీదే
న్యూఢిల్లీ: జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో భద్రపరచిన చితాభస్మం భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌దేనని బహిర్గత రహస్య పత్రాలు స్పష్టం చేశాయి. రెంకోజీ ఆలయంలోని చితాభస్మం నేతాజీదేనని మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం 2006లో అంగీకరించింది.
అంతేకాకుండా, టోక్యోలో నూతనంగా నిర్మించిన భారత రాయబార కార్యాలయ భవనానికి ఆ చితాభస్మాన్ని తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ జపాన్‌లోని భారత రాయబారిని ఆదేశించింది.
రెంకోజీ ఆలయంలో నేతాజీ అవశేషాలను ఇంకెంతోకాలం సగౌరవప్రదంగా భద్రపరచలేనంటూ ఆ ఆలయపూజారి వెల్లడించడంతో మన్మోహన్ ప్రభుత్వం పై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేతాజీకి సంబంధించి శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిర్గత పరచిన రహస్య పత్రాలు పేర్కొన్నాయి.

నేతాజీ సోవియట్‌లో గడపలేదు
కాగా, 1945 తర్వాత ఆనాటి సోవియట్ యూనియన్‌లో నేతాజీ జీవించినట్లుగా తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని రష్యా ప్రభుత్వం 1992, 1995లో రెండుసార్లు భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చిందని రహస్య ఫైళ్ల ద్వారా వెల్లడయ్యింది. ఈ విషయాన్ని బ్రిటన్ వెబ్‌సైట్ బోస్‌ఫైల్స్.ఇన్ఫో పేర్కొంది.
నేతాజీ సోవియట్ యూనియన్‌కు పారిపోయారన్న వాదనను మరోసారి ఖండించింది. గతేడాది డిసెంబరు 7వ తేదీన కూడా వెబ్‌సైట్ ఇదే విషయాన్ని పేర్కొంది. తైపీలో ఆగస్టు 18, 1945లో జరిగిన విమానప్రమాదం తరువాత నేతాజీ సోవియట్ యూనియన్‌కు పారిపోయారనే వదంతులు వ్యాప్తిలో ఉన్నాయి.
నేతాజీ ఎలా మరణించారు అనే అంశంపై నిజానిజాలను నమోదుచేసేందుకు నేతాజీకి వరుసకు మనుమడయ్యే ఆశిష్ రే బోస్‌ఫైల్స్.ఇన్ఫో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం రహస్య పత్రాలను బహిర్గతం చేయడంపై రే సంతోషం వ్యక్తం చేశారు. తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని మోడీ శనివారం బహిర్గతం చేసిన 16,600 పేజీలతో కూడిన 100 దస్త్రాల్లోని పత్రాలు స్పష్టం చేశాయి.












Click it and Unblock the Notifications