రేవంత్ రెడ్డి కేసులో మలుపు: ఎవరా కేంద్ర మంత్రి?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో కథ చాలా పెద్దగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బుధవారం రాత్రి మీడియా సమావేశంలో అన్నారు. ఎమ్మెల్యేలను కొనడానికి ముఠాలు దిగాయని, రేవంత్ రెడ్డికి సంబంధించిన ముఠా పట్టుబడడంతో మిగతా ముఠాలను వెనక్కి వెళ్లాయని ఆయన అన్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు పలువురు ఎమ్మెల్యేలతో మాట్లాడారని ఆయన అన్నారు.
కెసిఆర్ మాటలను బట్టి నోటుకు ఓటు కేసు పలు మలుపులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నోటుకు ఓటు కేసు తెలుగుదేశం పార్టీ పెద్దల మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోందంటూ మీడియా వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఏసీబీ మరో అనుబంధ ఎఫ్‌ఐఆర్‌ను సిద్ధం చేసిందని, అందులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, వ్యాపారవేత్త అయిన ఓ ఎంపీ పేరును చేర్చారని కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెలుస్తోందంటూ ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి రాసింది.

రేవంత్‌కు రూ.5 కోట్లు డబ్బును సమకూర్చిన వ్యవహారంలో వీరి పాత్ర ఉందనడానికి తగిన సాక్ష్యాధారాలను ఎసిబి సేకరిస్తోందని అంటున్నారు. రేవంత్ రెడ్డి, స్టీఫెన్‌సన్ మధ్య జరిగిన సంభాషణలను వీడియో చిత్రీకరించిన ఏసీబీ అధికారులు వాటిని శాస్త్రీయంగా నిరూపించేందుకు సిద్ధమవుతున్నారు. రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహాను వేర్వేరుగా విచారించిన దర్యాప్తు అధికారులు ఈ వ్యవహారం వెనక ఉన్న పెద్దలు ఎవరు, డబ్బు ఎలా సమకూరిందన్న అంశాలను రాబట్టినట్లు తెలుస్తోంది.
అనుబంధ ఎఫ్‌ఐఆర్‌లో ముఖ్యమైనవారి పేర్లు జోడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అ తరువాతే కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, టిడిపి ఎంపీకి ఏసీబీ నోటీసుల జారీ చేయవచ్చుననే ప్రచారం ఊపందకుంది.












Click it and Unblock the Notifications