కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అఖిల ప్రియకు సవాల్: భూమా హవా తగ్గించాలనే

By Pratap
|
Google Oneindia TeluguNews

కర్నూలు: తల్లి శోభా నాగిరెడ్డి వారసత్వాన్ని అందుకోవాలని చూస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి అఖిల ప్రియకు తెలుగుదేశం పార్టీ నుంచి సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నందిగామ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన అభ్యర్థిని పోటీకి దించలేదు. అయితే, నందిగామ వేరు, ఆళ్లగడ్డ వేరు అని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు వాదిస్తూ పోటీ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.

లోకేష్ కర్నూలు జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం తీరుతెన్నులు చూస్తే ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని నిలిపే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు విశాఖపట్నంలో ఉన్నందున ఆయన కుమారుడు లోకేష్‌తో సమావేశమయ్యారు. తమ అభిప్రాయాలు వెల్లడించారు. చివరగా అధినేత నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఆళ్లగడ్డలో తమ పార్టీ అభ్యర్థి పోటీ చేయకపోతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హవా పెరిగిపోతుందని టిడిపి జిల్లా నాయకులు లోకేష్ వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. ఇప్పటికే జిల్లాలో అధిక స్థానాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచుకున్నందున ఆళ్లగడ్డలో పోటీకి దిగకపోతే తమ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంటుందనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి అఖిలప్రియ నామినేషన్‌ దాఖలు చేయడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆళ్లగడ్డ నియోజకవర్గ ఆవిర్భావం నుంచి భూమా కుటుంబం హవా నడుస్తోంది. శోభా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రధానంగా భూమా, గంగుల కుటుంబాల మధ్య పోటీ సాగుతూ వస్తోంది. ఆ ఇరువురూ పార్టీలు మారినా కుటుంబాల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంటూ వస్తోంది.

Challenge for Akhila priya at Allagadda assembly segment

తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇరిగెల రాంపుల్లారెడ్డి కూడా భూమా కుటుంబంపై మూడుసార్లు పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో దివంగత నేత శోభానాగిరెడ్డి విజయం సాధించినా ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో టిడిపి సీటు ఎవరికి కేటాయిస్తారన్నది ప్రధానంశం కాకపోయినా పోటీ చేయాలని మాత్రం జిల్లా నాయకులు పట్టుపడుతున్నారు.

అనంతపురం జిల్లాలో పరిటాల రవీంద్ర హత్య అనంతరం అక్కడ జరిగిన ఉపఎన్నికలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి టిడిపిపై కాంగ్రెస్‌ అభ్యర్థిని పోటీకి దించారనే విషయాన్ని కర్నూలు జిల్లా నాయకులు గుర్తు చేస్తున్నా. అప్పట్లో సీఎం రాజశేఖరరెడ్డి వద్దకు పరిటాల సునీతపై పోటీ వద్దని దూతలను పంపినా వినలేదంటున్నారు. ఆ స్థానం ఫ్యాక్షన్‌ నియోజకవర్గమనే కారణంతో సునీతపై పోటీకి దించారని, అదే ఫార్ములా ఆళ్లగడ్డకు కూడా వర్తిస్తుందని, ఇదే విషయాన్ని చంద్రబాబుకు వివరించాలని జిల్లా నాయకులు అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

పోటీలో ఆ ఇద్దరు..

ఆళ్లగడ్డ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి అఖిలప్రియపై పోటీ చేసేందుకు టిడిపి నుంచి టికెట్ కోసం ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గంగుల ప్రభాకరరెడ్డి, ఆయనకంటే ముందు భూమా కుటుంబంపై టిడిపి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఇరిగెల రాంపుల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

వేగుల నివేదికలపై తర్జనభర్జన..

ఆళ్లగడ్డ ఉపఎన్నిక విషయంలో బలాబలాల పరిస్థితిపై ఇప్పటికే చంద్రబాబుకు వేగుల నివేదికలు అందినట్టు తెలుస్తోంది. దాన్నిబట్టి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అక్కడ శోభానాగిరెడ్డి మృతితో అఖిలప్రియపై సానుభూతి వ్యక్తమవుతుందేమోనని విశ్లేషకుల భావిస్తున్నారు. పదవిలో ఉన్న ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ మృతిచెందితే ఆ స్థానంలో జరిగే ఉపఎన్నిక ఫలితాలు మృతిచెందిన వారి వారసులకు అనుకూలంగా ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆళ్లగడ్డలో కూడా అదే పరిస్థితి ఉండవచ్చని చంద్రబాబు దృష్టికి పలువురు తీసుకెళ్లినట్టు సమాచారం. దీన్ని చంద్రబాబు ప్రధానంగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

అభ్యర్థి, ఖర్చుపై లోకేష్‌తో ఫైనల్‌ టచ్‌..

ఆళ్లగడ్డలో టిడిపి పోటీ చేయాల్సి వస్తే అభ్యర్థి ఎవరు? ఖర్చు ఎవరు భరించాలనే అంశాలపై శుక్రవారం రాత్రి లోకేష్‌తో జిల్లా నాయకులు చర్చించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖర్చు భరించిన అభ్యర్థి మళ్లీ భరించాలా? అధిష్ఠానం భరిస్తుందా? ఆ బాధ్యతలన్నీ జిల్లా నాయకులపై వేసుకోవాలా? వంటి అంశాలపై చర్చకు వచ్చినట్టు తెలిసింది.

లోకేష్‌తో సమావేశానికి వెళ్లిన వారిలో టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు బీసీ జనార్దనరెడ్డి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, మాజీమంత్రులు టీజీవెంకటేష్‌, శిల్పా మోహనరెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌, ఇన్‌చార్జిలు తిక్కారెడ్డి, మీనాక్షినాయుడు, వీరభద్రగౌడ్‌, ఆకెపోగు ప్రభాకర్‌, ఇరిగెల రాంపుల్లారెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, లబ్బి వెంకటస్వామితోపాటు శివానందరెడ్డి, మసాల పద్మజ, కేఈ ప్రభాకర్‌ తదితరులున్నారు. డోన్‌ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్‌, పాణ్యం ఇన్‌చార్జి ఏరాసు ప్రతాపరెడ్డి గైర్హాజరయ్యారు.

English summary
Telugudesam party Kurnool district leaders are for contest for Allagadda assembly segement against YSR Congress party candidate Akhila Priya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X