ఇస్తాం: కేసీఆర్‌కు బాబు 'పవర్' ఝలక్, హెచ్చరిక
హైదరాబాద్/గుంటూరు: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ లేకపోయినా, వర్షం పడకపోయినా, మరే సమస్యకైనా తానే కారణమంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం మండిపడ్డారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో కేసీఆర్ అనవసరంగా తనను ఆడిపోసుకుంటున్నారని దుమ్మెత్తిపోశారు.
తెలుగువారు అందరికోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశమని, వారి కష్టాన్ని తీర్చడానికి ఒక పరిష్కారమార్గాన్ని సూచిస్తూ తానే ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖరాశానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ కేటాయింపులు లేక 7వేల 200 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లు మూతపడి ఉన్నాయని, వాటికి గ్యాస్ కేటాయింపులు చేసినట్లయితే ఏపీలో మిగులు విద్యుత్ వస్తుందని, ఆ విద్యుత్ తెలంగాణకు ఇస్తామని తాను లేఖలో పేర్కొన్నట్టు చంద్రబాబు చెప్పారు.
సమస్య పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలే తప్ప విభేదాలు, విద్వేషాలు సృష్టించడం భావ్యం కాదని కేసీఆర్‌కు హితవు పలికారు. కరెంటు లేకపోయినా, వర్షం పడకపోయినా చివరకు భార్యాభర్తల మధ్య గొడవలకు కూడా తానే కారణమన్నట్టు తెరాస నేతలు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు అన్యాయం చేయాలని తాను ఎన్నడూ ఆలోచన చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన 120 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సమస్య లేకుండా చేయగలిగానని చెప్పారు.

తన శక్తి, సామర్థ్యాలేమిటో నిరూపించానన్నారు. ప్రజలంతా సహకరిస్తే రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలు ఈర్ష్యపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో పరుగులు తీయిస్తానని చెప్పారు. కేసీఆర్ తనను లక్ష్యంగా పెట్టుకొని మాట్లాడుతున్నారని, కలిసి పని చేయాలని కోరినా తన మాట వినడం లేదన్నారు. కరెంట్ సమస్య వస్తే ఢిల్లీకి వెళ్లి ఎంవోయు కుదుర్చుకొని, 24 గంటల విద్యుత్తుకు పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నామని, కేసీఆర్ మాత్రం హైదరాబాదులోనే కూర్చొని విమర్శలు చేస్తున్నారు.
విద్యుత్ సమస్య పరిష్కారానికి కేసీఆర్ ప్రయత్నించక తనను అంటే ఏం లాభమన్నారు. ఆంధ్రలో కరెంటు ఉత్పత్తి పెరిగితే మిగులు విద్యుత్తు తెలంగాణకు కేటాయించాలని తానే కేంద్రమంత్రిని కూడా కోరానని తెలిపారు. కేసీఆర్ ఇక నీ ఆటలు సాగవని, ప్రజలు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని గమనిస్తున్నారని, రాష్ట్రం భౌగోళికంగా విడిపోయినా తెలుగువారి మనసులు కలిసే ఉన్నాయని హెచ్చరించారు. పరస్పర సహకారంతో అభివృద్ధి చేసుకుందామన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ సమస్యను తాను తీర్చినట్లు, కేసీఆర్ ఎందుకు పరిష్కారించడం లేదని ప్రశ్నించారు. విభజనకు ముందే తాను విద్యుత్ సమస్య పైన కేసీఆర్‌ను హెచ్చరించానని, కానీ ఆయన ఏ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పైన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications