బాబు నోరు కట్టేసిన కెసిఆర్: రేవంత్ రెడ్డి మొత్తుకున్నా...
ఫిరాయింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వ్యవహారాన్ని తెలంగాణ మంత్రులు సాకుగా చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేస్తున్నదే తెలంగాణలో జరుగుతోందని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. నిజానికి, అదే జరుగుతోంది. ఫిరాయింపుల విషయంలో చంద్రబాబు మాట్లాడుకుండా చేయడంలో విజయం సాధించారని అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి గెలిచిన పార్లమెంటు సభ్యుడు ఎస్వీవై రెడ్డిని వెనువెంటనే చంద్రబాబు పార్టీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వలసలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఎనిమిది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకున్నారు.
దాంతో తెలంగాణ పార్టీ పుట్టి మునుగుతున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి తీరుపై, స్పీకర్ మధుసుదానాచారిపై తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి గొంతు చించుకుని మాట్లాడుతున్నా చంద్రబాబు నోరు విప్పడం లేదు. దానికితోడు, తెలంగాణలో పార్టీకి ఆయన నీళ్లొదలినట్లేనని అంటున్నారు.
టిడిపి సభ్యులను, టీఆర్ఎస్ విలీన సభ్యులుగా గుర్తిస్తు న్నట్లు స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై సైతం వ్యాఖ్యానిం చడానికి చద్రబాబు నిరాకరించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరుపున 15 మంది శాసనసభ్యులు విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఒకొక్కరుగా ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడి టీఆర్ ఎస్‌లో చేరారు. వీరంతా తమని అధికార టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని టీడీఎల్పీ మాజీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో, తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారిని కోరుతూ లేఖ రాశారు. ఎర్రబెల్లి లేఖను పరిగణలోకి తీసుకున్న స్పీకర్, టీడీపీ తరుపున విజయం సాధించి, టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది సభ్యులను విలీన సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు.

వారిద్దరు వెళ్లినా..
తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ సైతం పార్టీ వీడుతారని తెలిసినా, వారిని పిలిపించుకుని మాట్లా డి, బుజ్జగించే ప్రయత్నాలేవి చంద్రాబు చేయలేదు.

వారిద్దరూ కండువా కప్పుకున్నారు...
మాగంటి గోపినాథ్, గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకుని తమ వ్యవహారాన్ని సమర్థించుకున్నారు.

అభివృద్ధి పేరుతో...
తెలంగాణలో అభివృద్ధిని చూసి, తన నియోజకవర్గం అభివృద్ది కోసం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నట్లు మాగంటి గోపీనాథ్ చెప్పారు.

ఎపిలో చంద్రబాబు
ఎపిలో చంద్రబాబు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని, ఇక్కడ కెసిఆర్ ఉండాలని మాగంటి గోపినాథ్ అన్నారు.

చంద్రబాబు చేసిందే..
తాము టిడిపి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా తప్పేమీ చేయడం లేదని, చంద్రబాబు చేసిందే తాము చేస్తున్నామని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు.

ఎర్రబెల్లి చక్రం తిప్పారా...
తెలుగుదేశం పార్టీలో ఉంటూనే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెరాసలో చేరడానికి చక్రం తిప్పారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే ఈ విషయంపై స్పందించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిరాకరించారు. చంద్రబాబు వ్యవహారశైలి వల్ల తెలంగాణలోని పార్టీ శ్రేణులకు ఎటువంటి సంకేతాలు వెళ్తాయని ప్రశ్నిస్తు న్నారు. ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశానికి బాబు నీళ్లోదిలేశారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, దానికి మరింత ఊతమిచ్చే విధంగా ఆయన వ్యవహారశైలి ఉందని విమర్శిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి బాబు వ్యవహారశైలే కారణమని, ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి తమ్ముళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజాంకాలేజీలో జరిగిన ఎన్నికల ప్రచార శంఖారావలో బాబు ప్రసంగించిన తీరు మొదటికే మోసం తెచ్చిందన్నారు. టీఆర్ఎస్ పాలనతీరుపై, అధికార పార్టీ విధానాలపై చంద్రబాబు విరుచు కుపడుతారని భావిస్తే, ఆయన టీఆర్ఎస్ ఊసేత్తకపోవడం వల్లే పార్టీ శ్రేణులు ముందుకొచ్చి ధైర్యంగా పని చేయలేదని, టీడీపీకి ఓటేయడం వల్ల ప్రయోజనం లేదని ప్రజలు భావించారంటున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత ఒకొక్కరుగా పార్టీ వీడుతున్నా , కనీసం వారిని నిలువరించేందుకు చంద్రబాబు చొరవ చూపించకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్నా, లేకపోయిన ఫర్వాలేదన్నట్లుగా బాబు వ్యవహారశైలి ఉందని మండిపడుతున్నారు. కెసిఆర్ విమర్సించడానికి తగిన ఆయుధాలు చంద్రబాబుకు లేకుండా పోయాయి.












Click it and Unblock the Notifications