చిరంజీవిని కాంగ్రెస్ దూరం పెట్టడానికి కారణం ఇదేనా?
హైదరాబాద్/అమరావతి: మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత పార్లమెంటుసభ్యుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా తెలుసు. అయినా, చిరంజీవిపై కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఫిర్యాదు లేదు.
అంతేగాక, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చిరంజీవికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి తన 150వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చిరంజీవిని ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదు.

అయితే, దీని వెనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన వేరే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి లాంటి ప్రజా ఆదరణ ఉన్న నేతను కీలక సమయాల్లోనే ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల వరకు చిరంజీవికి పూర్తి స్వేచ్ఛనిచ్చి తన సినిమాలను పూర్తి చేసుకునేందుకు సహకరించాలని భావిస్తోంది.
ఆ తర్వాత ఎన్నికల సమయంలో మాత్రం చిరంజీవి సేవలను పార్టీ వినియోగించుకోవాలని చూస్తోంది. ఎన్నికల సమయం వరకు చిరంజీవి నటించిన పలు సినిమాలు విడుదలై ప్రజల్లో ఆయనపై మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అది పార్టీకి కలిసి వచ్చే అంశంగా చూస్తోంది.

అంతేగాక, మెగా ఫ్యామిలీలోని మరికొంత మంది హీరోలను కూడా ఎన్నికల సమయంలో పార్టీ ప్రచార కార్యక్రమాల కోసం ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే చిరంజీవికి పూర్తి స్వేచ్ఛనిచ్చి తన సినిమా షూటింగ్స్ పూర్తి చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి.. తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జరిగినప్పటికీ అది వాస్తవం కాదని దీన్ని బట్టి చూస్తే అర్ధమవుతోంది. కాగా, వచ్చే ఎన్నికల నాటికి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి కొండంత బలంగా.. ఎన్నికల ప్రచారంలో కీలక భూమిక పోషించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications