అమెరికాకే నష్టం: గ్రీన్ కార్డుకూ హెచ్ -1 బీ వీసాకు లింక్‌.. ట్రంప్‌పై విమర్శల ఝరి!

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: 'హైర్ అమెరికన్ - బై అమెరికన్' అనే నినాదం పేరిట విదేశీ వలస ఉద్యోగులు ప్రత్యేకించి ఐటీ ఉద్యోగుల వలసలను నిరోధించే పేరుతో 'హెచ్- 1బీ' వీసాలో కఠిన నిబంధనలు అమలు చేసేందుకు పూనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రాజేస్తున్న వీసా కుంపటి భారత్‌లోనే కాక ఆ దేశంలోనూ సెగ పుట్టిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో, ఉపాధి సృష్టిలో కీలక భూమిక పోషిస్తున్న లక్షలమంది వలసదారుల్ని వెనక్కి పంపడానికి ట్రంప్‌ సర్కార్ చేస్తున్న ప్రయత్నం అన్ని వైపులా తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటోంది.

స్టెమ్‌(విజ్ఞానశాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, ఇంజినీరింగ్‌, గణితం) రంగాలకు వెన్నెముకగా నిలిచే లక్షల మంది నైపుణ్య సిబ్బందిని వెనక్కి పంపడంతో ప్రతిభావంతులు, అనుభవజ్ఞులకు తీవ్ర కొరత ఏర్పడుతుందని కొందరు అమెరికా కాంగ్రెస్ సభ్యులు, సెనెటర్లు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ ప్రభుత్వాన్ని లాబీయింగ్‌ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. అంతటి భారీ సంఖ్యలో అర్హులైన అమెరికన్లను ఎక్కడ్నుంచి తెస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల లక్షల మంది విదేశీయుల భవిష్యత్ ప్రశ్నార్థకం కావడం ఒక కోణమైతే, వృతి నిపుణుల నిష్క్రమణతో అమెరికాకు కలిగే నష్టం అపారంగా ఉంటుంది. 

నిపుణులైన మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్న అమెరికా ఆర్థికవ్యవస్థకు ట్రంప్‌ యోచన శరాఘాతమే. వలసవచ్చిన వారు ఏర్పాటుచేసిన కంపెనీలు, విదేశీ వృత్తి నిపుణులు చేసిన శ్రమ, సృష్టించిన సంపదను చూస్తే వీరి వాదన నూటికి నూరుశాతం వాస్తవమని రుజువవుతుంది. విదేశీయుల ప్రతిభాపాటవాలతో కొత్త పుంతలు తొక్కుతున్న సిలికాన్‌ వ్యాలీ చిన్నబోయే అవకాశాలే ఎక్కువ. ఐటీ టెక్నాలజీపై ఇప్పటివరకు అమెరికా ప్రదర్శించిన గుత్తాధిపత్యానికి చెల్లు చీటీ ఇవ్వాల్సిందే. ఈ తరుణంలో హెచ్‌-1 బీ వీసా పొడిగింపును నియంత్రించాలన్న ట్రంప్‌ ప్రభుత్వ యోచన వల్ల అమెరికాకు కలిగే నష్టాలు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు విదేశీయుల సేవలను పరిశీలిద్దాం..

 టెక్నాలజీలో అగ్రస్థానంలో సిలికాన్ వ్యాలీ

టెక్నాలజీలో అగ్రస్థానంలో సిలికాన్ వ్యాలీ

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల మేధావులు, వృత్తినిపుణులు, స్టార్టప్‌ల సృష్టికర్తలు అమెరికాలో ముఖ్యంగా సిలికాన్‌ వ్యాలీలో పనిచేస్తున్నారు. ఇందులో ఎక్కువమంది భారతీయులే. ట్రంప్‌ ప్రయోగిస్తున్న హెచ్‌-1 బీ వీసా పిడుగుతో లక్షల మంది నిపుణులు అమెరికాను వీడాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా మేధో వలసకు దారి తీస్తుంది. ఐటీ, ఇతరత్రా టెక్నాలజీలో సిలికాన్‌ వ్యాలీ ప్రస్తుతం ప్రపంచ నాయకత్వ స్థానంలో ఉంది. ప్రభుత్వ తాజా విధానాలతో ఈ నాయకత్వ స్థానాన్ని ఇతర దేశాలు తన్నుకుపోయే ప్రమాదమే కాదు నిపుణులకు ఆ దేశాలు ఎర వేయొచ్చు. నిపుణులకు తమ ద్వారాలు తెరిచే ఉంచుతామని ఇప్పటికే కెనడా మంత్రి నవదీప్‌ బైన్స్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మెక్రాన్‌ ప్రకటించారు. సాంకేతికంగా ఎదుగుతున్న ఫ్రాన్స్‌ తదితర దేశాల వైపు పెట్టుబడులు మళ్లే అవకాశం ఉంది. ఒకనాడు ప్రపంచ ఆటో రంగం రారాజుగా వెలుగొందిన డెట్రాయిట్‌ ఇప్పుడు ఎంతటి గడ్డుస్థితిని ఎదుర్కొంటోందో.. సిలికాన్‌ వ్యాలీ కూడా అలాంటి ప్రమాదాన్నే ఎదుర్కోవచ్చంటున్నారు.

 అమెరికన్ల భాగస్వామ్యంతో పెద్ద కంపెనీలు స్థాపించిన విదేశీయులు

అమెరికన్ల భాగస్వామ్యంతో పెద్ద కంపెనీలు స్థాపించిన విదేశీయులు

లక్షల మంది విదేశీయుల కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ప్రస్తుతం సిలికాన్‌ వ్యాలీలో పనిచేస్తున్న వారు ప్రముఖ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యనభ్యసించి, వృత్తి నైపుణ్యం సంపాదించిన వారు. టెక్నాలజీ రంగంలో అమెరికా నాయకత్వ స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతో గత పాలకులు వీరందరినీ తమ దేశంలోకి ఆహ్వానించడంతో.. కొందరు సొంతంగా, మరికొందరు అమెరికన్ల భాగస్వామ్యంతో పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించారు. ఈ కంపెనీల్లో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన వృత్తి నిపుణులు పనిచేస్తున్నారు. విస్తరించిన ఆర్థికవ్యవస్థ, పుట్టుకొచ్చిన కంపెనీల్ని సమర్థంగా నిర్వహించే స్థాయిలోగానీ, సంఖ్యలోగానీ అమెరికా వృత్తి నిపుణులు లేరు. దీనికి కారణం అమెరికన్లు ఆ దిశగా ఉన్నత చదువులవైపు దృష్టి సారించకపోవడమే. ఇప్పుడు హఠాత్తుగా లక్షల సంఖ్యలో నిపుణులు దేశాన్ని వీడితే నైపుణ్యానికి తీవ్ర కొరత ఏర్పడుతుంది. అమెరికాలో నాలుగు అతిపెద్ద కంపెనీలైన యాపిల్‌, ఆల్ఫాబెట్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌లు దాదాపు 15 లక్షలమందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇందులో పలువురు విదేశీయులు ఉంటున్నారు. వీరంతా అమెరికాకు రాకుండా తాము ఉన్న చోటే తమ నైపుణ్యాన్ని వినియోగిస్తే.. అది అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.

గూగుల్, ఐఫోన్‌లే ప్రపంచానికి ఆధారం

గూగుల్, ఐఫోన్‌లే ప్రపంచానికి ఆధారం

సాంకేతిక ఎగుమతుల ద్వారా అమెరికా కోట్ల డాలర్లను ఆర్జిస్తోంది. అమెరికా సృష్టించిన ఫేస్‌బుక్‌, ఐఫోన్‌, గూగుల్‌పైనే ప్రపంచం ఆధార పడుతోంది. తదుపరి తరం సాంకేతిక పరిజ్ఞానం అమెరికా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వస్తే.. అమెరికా పరిస్థితి ఏమిటన్నది ఊహించడం కూడా కష్టం. అసందిగ్ధ భవితతో ఇప్పటికే సిలికాన్‌ వ్యాలీలో పెట్టుబడులు చాలావరకు తగ్గిపోయాయి. ఉబర్‌ సహా కొన్ని కంపెనీలు ప్రైవేట్ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడుల నిబంధన అమలులో ట్రంప్‌ సర్కారు జాప్యం చేయడం వల్ల అమెరికాకు స్టార్టప్‌లను తెచ్చే విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారు.
వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలన్న ట్రంప్‌ నిర్ణయంతో శుద్ధ ఇంధన సాంకేతిక పరిజ్ఞానం, ఇంధన స్టార్టప్‌లు అమెరికా నుంచి దూరంగా జరుగుతున్నాయి. ఇది కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థకు శరాఘాతమే. యాపిల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, నెట్‌ఫ్లిక్స్‌లాంటివి అమెరికా ఆర్థికవ్యవస్థకు వెన్నుదన్నయితే.. బైదు, అలీబాబా, టెన్సెంట్‌ లాంటి టెక్‌ కంపెనీలతో చైనా దేశం సిలికాన్‌ వ్యాలీతో పోటీపడుతోంది. కృత్రిమ మేధ, పరిశోధన, స్టార్టప్‌లపై చైనా వందల కోట్ల డాలర్లను పెట్టుబడి పెడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ సాంకేతిక సామ్రాజ్యంపై అమెరికా గుత్తాధిపత్యానికి తెరపడొచ్చు.

 స్టార్టర్ కంపెనీల్లో సగానికి పైగా ఇమ్మిగ్రేంట్లవే

స్టార్టర్ కంపెనీల్లో సగానికి పైగా ఇమ్మిగ్రేంట్లవే

కొంగొత్త ఆలోచనల్తో.. వినూత్న స్టార్టప్‌లను, శీఘ్రగతిన విస్తరించే ప్రైవేట్ కంపెనీల్ని సృష్టించడంలో వలసవచ్చిన వారు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వీరు ఎంతగా పాటుపడుతున్నారో 2016 జనవరి 1 నాటి గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. అమెరికాలోని 87 పెద్ద స్టార్టప్‌ కంపెనీల్లో దాదాపు సగానికి పైగా(44) వలసవచ్చిన వారు ఏర్పాటుచేసినవే. వీటి విలువ దాదాపు 16800 కోట్ల డాలర్లు ఉంటుంది. ఈ కంపెనీల్లో మేనేజ్‌మెంట్‌, ఉత్పాదక అభివృద్ధి బృందాల్లో ఉంటున్నది దాదాపు 70 శాతం మంది ప్రవాసులే. వీటిలో ఒక్కో కంపెనీ అమెరికాలో సగటున 760 ఉద్యోగాలు సృష్టించింది. ఈ 44 స్టార్టప్‌ కంపెనీ వ్యవస్థాపకుల్లో కనీసం ఒక్కరైనా విదేశీయుడు ఉంటున్నారు. 87 స్టార్టప్‌లలో కనీసం 62 కంపెనీల్లో కీలకమైన చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌, సీఈఓ, వైస్‌ప్రెసిడెంట్‌లాంటి కలక పదవుల్ని నిర్వహిస్తున్నది విదేశీయులే. వలసవచ్చిన వారు ప్రధానంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానం(ఐటీ), ఆరోగ్యం, ఇంధనం, ఆర్థిక సేవలు తదితర రంగాల్లో సేవలందిస్తున్నారు.

 ఆరు స్టార్టప్ కంపెనీల్లో 1.62 లక్షల మందికి ఉపాధి

ఆరు స్టార్టప్ కంపెనీల్లో 1.62 లక్షల మందికి ఉపాధి

అమెరికాలోని ఐటీ దిగ్గజ సంస్థలు, ఇతర కార్పొరేట్ సంస్థల్లో సేవలందిస్తున్నపలువురు విదేశీ ప్రముఖులు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్ వాసి గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయి తమిళనాడు వాసి. ఇక పెప్సికో సీఈఓ ఇంద్రానూయి, యాప్ డైనమిక్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జ్యోతి బన్సాల్ భారతీయులే కావడం గమనార్హం. అంతేకాదు భారతీయుల్లో యాష్ అశుతోష్ ప్రారంభించిన స్టార్టప్ కంపెనీ ‘యాక్టిపో'లో 350 మందికి, జ్యోతి బన్సాల్ ‘యాప్ డైనమిక్స్'లో 900, కేఆర్ శ్రీధర్ సారథ్యంలోని బ్లూమ్ ఎనర్జీ 1200, అపూర్వ మెహతాకు చెందిన ఇన్ స్టాకార్ట్ 300, జోగిందర్ మహ్మద్ ఆధ్వర్యంలో నడుస్తున్న జాస్పర్ 425, ధీరజ్ పాండే, అజిత్ సింగ్, మోహిత్ అరోన్ సంయుక్త నిర్వహణలో నడుస్తున్న ‘నటానిక్స్' అనే స్టార్టప్ 864 మందికి ఉపాధి కల్పిస్తోంది. స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు దక్షిణాఫ్రికా వాసి ఎలాన్ మస్క్ కాగా, ఉబర్ సహ వ్యవస్థాపకుడు గ్యారెట్ క్యాంప్, క్లౌడ్‌ఫేర్ సహ వ్యవస్థాపకురాలు మిచెల్లీ జాట్లిన్ కెనడా పౌరులే మరి. ఆరు విదేశీ సంస్థలు కల్పించిన స్టార్టప్ కంపెనీల్లో రమారమీ 1. 62 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. అమెరికాలోని నగర రవాణా వ్యవస్థల్లో ఉబర్ గుణాత్మక మార్పులు తీసుకొస్తే, ‘స్పేస్ ఎక్స్' అమెరికన్లను అంగారకుడిపైకి తీసుకెళ్లే లక్ష్యంతో పని చేస్తోంది. దేశంలో ట్రాఫిక్, భద్రత సంబంధిత వెబ్ సైట్లను అభివ్రుద్ది చేసిన సంస్థగా క్లౌడ్‌ఫ్లేర్ నిలిచింది. ఉద్యోగుల వేతన పట్టీలను గస్టో తయారు చేస్తుండగా, వ్యాపార, ఇతరత్రా ఖాతాదారులకు ఆన్ లైన్ చెల్లింపులకు ‘స్ట్రైప్' సహకారం అందిస్తోంది. యాప్స్ డైనమిక్స్, క్లౌడేరా, టానియం, ఎంయూ సిగ్మా తదితర సంస్థలు బలమైన ఐటీ వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రపంచ మార్కెట్‌లో అమెరికా పోటీ పడేలా చేస్తున్నాయి.

 ట్రంప్ ప్రతిపాదన.. గ్రీన్ కార్డు ఆశలకు శరాఘాతమేనన్న యూఎస్‌ఐబీసీ

ట్రంప్ ప్రతిపాదన.. గ్రీన్ కార్డు ఆశలకు శరాఘాతమేనన్న యూఎస్‌ఐబీసీ

హెచ్‌-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఆ దేశానికే ముప్పులా పరిణమించనున్నదని యూఎస్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌(యూఎస్‌ఐబీసీ) నొక్కి వక్కాణిస్తోంది. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఇక హెచ్‌-1బీ వీసాపై అమెరికాలో ఉంటున్నవారు ఆరేళ్లలోపు గ్రీన్‌కార్డు రాకపోతే స్వదేశానికి పంపే ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో యూఎస్‌ఐబీసీ ఓ ప్రకటన వెలువరించింది. ‘అమెరికాలో ఏళ్లుగా నివాసం ఉంటూ గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్న నైపుణ్యం గల వారికి ఇది నిజంగా శరాఘాతమే! ఇది అత్యంత చెత్త నిర్ణయం. బహుశా వారు మళ్లీ అమెరికాకు రాలేరేమో. ఈ విధానం అమెరికా వ్యాపార రంగానికి, ఆర్థిక వ్యవస్థకు దేశానికి ఎంతో హానికరం. ఒక లక్ష్యంతో సాగుతున్న అమెరికన్‌ వలస విధాన వ్యవస్థకు ఇది విఘాతం కలిగించేది' అని యూఎస్‌ఐబీసీ తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
WASHINGTON: The move to end extension of H-1B visas would be 'bad policy' and is contrary to the goals of a merit-based immigration system, the US Chamber of Commerce said on Saturday over the Trump administration's reported plan that could result in self-deportation of around 700,000 Indians.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X