ఆత్మహత్యలు: 'మాఫీ' పరిమితికి కారణమదేనా?
హైదరాబాద్: తెరాస ప్రభుత్వం రుణమాఫీ నిబంధనల పైన రైతులు, విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. రైతులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది తీసుకున్న వ్యవసాయ రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందనే వార్తల నేపథ్యంలో మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఇద్దరు రైతులు గుండెపోటుతో మృతి చెందారు.
మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం ఖాసీంపూర్‌కు చెందిన రైతు దత్తాత్రేయ రుణమాఫీ వర్తించదేమోనన్న బెంగతో గురువారం రాత్రి టీవీ చూస్తూ కుప్పకులాడు. కరీంనగర్ జిల్లా బెజ్జంగి మండలం మాదాపూర్‌కు చెందిన నూనె స్వామిరెడ్డి శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన రైతు రాజశేఖర రెడ్డి రుణమాఫీ కాదేమోనన్న ఆందోళనతో గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్రభుత్వం తర్జన భర్జన
రుణమాఫీ ఆంక్షలపై ఆగ్రహించిన రైతులను చల్లార్చడంపై తెరాస ప్రభుత్వం అంతర్మథనం చెందుతోంది. అధికారంలోకి వచ్చి నాలుగు రోజులైనా కాకముందే తీవ్రస్థాయి ఆందోళనలు మొదలుకావడంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ అమలుకు షరతులు విధించడంపై మండిపడుతూ పెద్ద సంఖ్యలో రైతులు రోడ్లపైకి వస్తుండటం, జైకొట్టిన చేతులతోనే దిష్టిబొమ్మలు దహనం చేస్తుండటం, కొందరు రైతుల హఠాన్మరణానికి షరతులే కారణమంటూ కుటుంబ సభ్యులు పేర్కొంటుండటంతో ప్రభుత్వం పరిస్థితి చక్కదిద్దే చర్యలు మొదలుపెట్టింది.
మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు శుక్రవారం సచివాలయంలో సమావేశమై రుణమాఫీపై చర్చించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కొన్ని పార్టీలు దీనిపై రచ్చ చేస్తున్నాయని, కొందరు రైతులను కావాలనే రెచ్చగొడుతున్నారని వారు చెప్పారు. పార్టీల మాటలు నమ్మి రైతులు ఆందోళన చెందవద్దన్నారు. రైతు రుణమాఫీపై సోమవారం బ్యాంకర్ల నుండి పూర్తి సమాచారం అందిన తర్వాత స్పష్టత వస్తుందన్నారు.
కాగా, వ్యవసాయ రుణమాఫీ పైన బ్యాంకర్ల నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కెసిఆర్ ఏర్పాటు చేసిన సమావేశంలోనూ బ్యాంకర్లు తమ వైఖరి చెప్పి ఉంటారని అంటున్నారు. ప్రభుత్వం పరిమితులకు అదే కారణం కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు రైతు రుణాల మాఫీపై మాటమార్చితే తీవ్రస్థాయిలో నిరసనలు తప్పవని విపక్షాలు హెచ్చరించాయి.












Click it and Unblock the Notifications