జీఎస్టీ: వేటిపై ధరలు తగ్గుతాయి, వేటిపై పెరుగుతాయి
ప్రజలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాలు.. ఇలా అన్ని వర్గాలపైనా జీఎస్టీ ప్రభావం ఎలా ఉంటుంది!? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది!? అనే సందేహాలకు ఇప్పటికీ స్పష్టత లేదు.
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య భారతావనిలో అతిపెద్ద సంస్కరణగా భావించే 'వస్తు సేవల పన్ను (జీఎస్టీ)' శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తోంది. ఒక దేశం - ఒకే పన్ను నినాదంతో 18 రకాల పరోక్ష పన్నుల స్థానే ప్రవేశపెడుతున్న జీఎస్టీ.. ఎలాంటి ఫలితాలను అందిస్తుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది.
ప్రజలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాలు.. ఇలా అన్ని వర్గాలపైనా జీఎస్టీ ప్రభావం ఎలా ఉంటుంది!? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది!? అనే సందేహాలకు ఇప్పటికీ స్పష్టత లేదు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ తదితరులు అట్టహాసంగా అంగరంగ వైభవంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. విపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించొద్దని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కోరారు.జీఎస్టీతో కొన్ని వర్గాలకు లాభం ఉంటుందని చెబుతున్నా.. ఏ మేరకు లాభం ఉంటుంది, ఏ తరహాలో ప్రయోజనం చేకూరుతుంది, అసలు లాభం ఉంటుందా లేదా అన్నదానిపైనా ఎన్నో సందేహాలు ఉన్నాయి.
దేశంతో పాటు అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ, ప్రజా జీవనంతో ముడిపడిన ఈ కొత్త పన్నుల విధానంపై ఎన్నో రకాల అంచనాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేటి అర్ధరాత్రి నుంచి కొత్త పన్నుల విధానం అమల్లోకి రానుంది. ఈ విధానం ఎటువంటి ప్రభావం చూపనున్నదనే అంశంపై వివిధ వర్గాల్లో ఆందోళనలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

రూ.20 లక్షల్లోపు టర్నోవర్‌పై నో టాక్స్
ఇప్పటివరకు రూ.5 లక్షల కన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు, సంస్థలు మాత్రమే పన్ను కట్టాల్సి వచ్చేది. జీఎస్టీలో రూ.20 లక్షల కన్నా తక్కువ వార్షిక టర్నోవర్ ఉంటే పన్ను పరిధిలోకి రారు. వారు తయారుచేసే లేదా విక్రయించే వస్తువులకు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కానీ రూ.20 లక్షలలోపు టర్నోవర్ ఉందని చూపేందుకు చిరు వ్యాపారులు ఏం చేయాలన్న దానిపై స్పష్టత లేదు. వ్యాపార లావాదేవీల తనిఖీ, టర్నోవర్ అంచనాల పేరుతో ముందు ముందు ఏవైనా ఇబ్బందులు తలెత్తుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జీఎస్టీ అమలుతో చిరు వ్యాపారులకు ఆన్‌లైన్ ద్వారా అన్ని లావాదేవీలను నిర్వహించడం కష్టం కానున్నది. ముఖ్యంగా ప్రతి ఇన్వాయిస్‌ను అప్‌లోడ్ చేయాల్సి రావడం, ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సి రావడం ఇబ్బందికరమే.

ఆచరణలోనే జీఎస్టీ అమలు ప్రభావం
అంతర్రాష్ట్ర వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉండడం పెద్ద వ్యాపారులకు ఊరట కలిగించనున్నది. వస్తువును తయారుచేసిన రాష్ట్రాలకు ఎలాంటి పన్ను అందదు. వాటిని వినియోగించే రాష్ట్రాలకే పన్ను వెళుతుంది. అదే రాష్ట్రంలో తయారుచేసి అక్కడే అమ్ముకుంటే ఆ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. దీనివల్ల ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసే వస్తువుల తయారీ పరిశ్రమలకు సబ్సిడీలు ఇచ్చేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పెద్ద వ్యాపారులు, పారిశ్రామికవేత్తలపై ప్రభావం ఎలా ఉంటుందనేది ఆచరణలోనే అనుభవంలోకి వస్తుంది. అంతిమంగా వినియోగదారుడిపై పన్ను ప్రభావం పడుతుంది కనుక లాభనష్టాల బేరీజు అవసరం లేదు. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి జీఎస్టీ అమల్లో ఏ మార్పు తీసుకువస్తుందనే దానిని బట్టి పెద్ద వ్యాపారులు, పారిశ్రామికవేత్తల ప్రయోజనం ఆధారపడి ఉన్నదని చెప్తున్నారు.

కస్టమర్‌కు మోయలేని భారమే
వస్తువును బట్టి గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అన్ని రకాల పన్నులు కలిపి 42 శాతం వరకు పన్నుగా చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు నాలుగు శ్లాబుల్లో గరిష్టంగా 28 శాతం మాత్రమే పన్ను ఉంటుంది. జీఎస్టీ అమలుతో ధరలు తగ్గుతాయనే అంచనాలు ఉన్నాయి. వాస్తవంగా వినియోగ వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయి? వేటి ధరలు తగ్గుతాయి, ఏవి పెరుగుతాయి.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోనికి ఎందుకు తీసుకురాలేదు? అలా తెస్తే కచ్చితంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేవి కదా? పన్ను సంస్కరణల ప్రభావం పేరుతో వ్యాపారులు తమపై భారం వేస్తారా? అయితే వినియోగదారులకు జీఎస్టీ ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుందన్నది కొద్దిరోజుల తర్వాతగానీ పరిస్థితి అర్థం కాదు. ముఖ్యంగా ధరల పెరుగుదల, వ్యాపారుల దృక్పథం, జీఎస్టీ కౌన్సిల్ విధానాలు వినియోగదారులపై ప్రభావం చూపనున్నాయి.

ఐదేళ్ల పాటు కేంద్రం పరిహారం
జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వ పన్ను వసూళ్ల రాబడిలో తగ్గుదల కనిపిస్తే ఆ మేరకు ఐదేళ్ల పాటు కేంద్రమే పరిహారం చెల్లిస్తుంది. ఆ లోగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ వనరులను పెంచుకోవాల్సి ఉంటుంది. జీఎస్టీ వల్ల రాబడి తగ్గితే నెలవారీ లావాదేవీలకు ఇబ్బందులెదురవుతాయా? తక్షణ అవసరాలను ఎలా సర్దుబాటు చేసుకోవాలి? కానీ కేంద్రం ఐదేళ్లు ఇచ్చే పరిహారాన్ని ఎప్పుడెప్పుడు ఇస్తారో స్పష్టంగా చెప్పలేదు. ఆ నిధులకు ఎదురు చూడాల్సిందేనా? రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బందిని ఎలా అధిగమించాలి? ఈ విషయంలో కేంద్రం ఏవైనా మినహాయింపులిస్తుందా? అన్న విషయాన్ని పరిశీలించాల్సి ఉంటున్నది. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం వల్ల రాష్ట్రాలు ఏ వస్తువుపైనైనా పన్ను విధించే అధికారాన్ని శాశ్వతంగా కోల్పోతాయి. మళ్లీ పార్లమెంటులో చట్టం చేస్తేనే రాష్ట్రాలకు ఆ అధికారాలు వస్తాయి. ఇక జీఎస్టీ అమలు కోసం సర్దుబాటు చేసుకోవాల్సిన ఉద్యోగాలు రాష్ట్రాలపై అదనపు భారమే.

వస్తువు విక్రయించిన చోటే పన్ను
జీఎస్టీ ప్రకారం మార్కెట్‌లో లభ్యమయ్యే ప్రతి వస్తువుపై (పెట్రోలియం ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులు, మద్యం మినహా) నాలుగు శ్లాబుల్లో మూడు రకాల పన్నులు చెల్లించాలి. కేంద్ర వస్తు సేవల పన్ను (సీజీఎస్టీ), రాష్ట్ర వస్తుసేవల పన్ను (ఎస్‌జీ ఎస్టీ), సమీకృత వస్తుసేవల పన్ను (ఐజీఎస్టీ)గా పేర్కొనే ఈ మూడు రకాల పన్నులూ కలిపే జీఎస్టీగా వ్యవహరిస్తారు. జీఎస్టీలో నిర్ణయించిన పన్ను శ్లాబుల్లో ఈ మూడు రకాల పన్నులూ కలిసే ఉంటాయి. ఒకే రాష్ట్రంలో తయారుచేసి, వినియోగిస్తే (సీజీఎస్టీ), (ఎస్‌జీఎస్టీ) కలిపి ఉంటాయి. అంతర్రాష్ట్ర లావాదేవీల్లో ఐజీఎస్టీ ఉంటుంది. నేరుగా వినియోగం కోసం విక్రయించే చోట ఈ పన్నులను వసూలు చేస్తారు. ఆయా వస్తుసేవలను వినియోగిం చిన రాష్ట్రాన్ని బట్టి కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల సొమ్ము పంపకం జరుగుతుంది. వస్తుసేవలను నాలుగు రకాలుగా విభజించి 5, 12, 18, 28 శాతాలుగా జీఎస్టీని నిర్ధారించారు. ఆ వస్తుసేవలు ఏ కేటగిరీలో ఉన్నాయనే దానిని బట్టి గరిష్టంగా అంత శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

జీఎస్టీ నెట్‌వర్క్ ఇలా
జీఎస్టీ నిబంధనల ప్రకారం.. డీలర్లు, వ్యాపారులు పన్నును ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. రిజి స్ట్రేషన్, రిటర్నులు, చెల్లింపులూ ఆన్‌లైన్‌లోనే చేయాలి. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అన్ని ఇన్వాయిస్‌లను అప్‌లోడ్ చేయాలి. ఈ విధంగా జీఎస్టీ కింద ప్రతి నెలా దేశవ్యాప్తంగా 200కోట్లకు పైగా ఇన్వాయిస్‌లు అప్‌లోడ్ అవుతాయని అంచనా. అన్ని లావాదేవీల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఇవి 20 ఏళ్ల పాటు రికార్డుల్లో ఉండేలా పోర్టల్‌ను రూపొందించారు. ఈ జీఎస్టీ పోర్టల్‌లోకి డీలర్ టిన్ నంబర్‌తో నమోదైతే.. ఆ డీలర్ జీఎస్టీ నెట్‌వర్క్‌లో చేరినట్టే.

పెరుగనున్న ఎరువుల ధరలు
జీఎస్టీ పన్ను శ్లాబుల్లో చేర్చిన వస్తువులను బట్టి చూస్తే.. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులపై పూర్తిగా పన్ను ఎత్తివేయడంతో నిత్యావసరాల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. అవి మినహా నిత్యం వినియోగించే వస్తువుల ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అన్న దానిపై కొంతకాలం తర్వాతే స్పష్టత రానున్నది. వ్యవసాయ ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించినా.. ఎరువులపై పన్ను పెంచడంతో ఆ మేరకు రైతాంగంపై భారం పడనున్నది.

ఇలా ద్విచక్ర వాహనాల ధరల పెరుగుదల
బొట్టుబిళ్లలు, కుంకుమ, స్టాంపులు, పుస్తకాలు, న్యూస్ పేపర్లు, గాజులు, చేనేత, మెట్రోరైళ్లు, లోకల్ రైళ్లు, మాంస ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాలు, బ్రెడ్, తేనె లాంటి వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించడం మేలు చేకూర్చనుంది. ఇక రబ్బరు టైర్లు, ప్లాస్టిక్ వస్తువులపై గతంలో కన్నా 10 శాతం ఎక్కువ పన్ను పడనుండడం భారమైనట్టే. గతంలో పన్ను లేని ఆటోమొబైల్ విడిభాగాలను ఏకంగా 28 శాతం పన్ను శ్లాబు కిందకు తేవడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర రవాణా వాహనాల ధరలు పెరిగే అవకాశాలున్నాయి.

మార్పులు, చేర్పులకు 15 రోజులు
జీఎస్టీతో విలాస వస్తువులు, సేవలపై మాత్రం పన్ను మోత మోగనుంది. సినిమాలు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, మ్యారేజ్ ఫంక్షన్ హాళ్లు, ఫైవ్‌స్టార్ హోటళ్లు, రేస్‌క్లబ్ బెట్టింగ్‌లు, బ్యూటీకేర్ వస్తువులు వంటివాటి ధరలు, చార్జీలు బాగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ పన్ను విధానం శనివారం నుంచే అమల్లోకి వచ్చినా.. దానిద్వారా వ్యాపార లావాదేవీలు పూర్తిస్థాయిలో జరిపి.. ధరల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు 10,15 రోజులు పట్టే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఖజనాపై ప్రభావం చూపే జీఎస్టీ
జీఎస్‌టీ అమలుతో లాభమెంత? నష్టమెంత.. వర్తకులు, వ్యాపారులు, వినియోగదారులకు ఎంత మేరకు ప్రయోజనం.. ఏ ధరలు తగ్గుతాయి.. ఏవి పెరుగుతాయి అన్న ఆందోళనల మధ్య మరికొద్ది గంటల్లో జీఎస్‌టీ అమల్లోకి రానున్నది. వ్యాపారుల రోజువారీ కార్యకలాపాలతో పాటు, వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలపై వస్తు, సేవల పన్ను భారీ ప్రభావం చూపనుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఏడాది అనంతరం పూర్తి స్థాయి విశ్లేషణ తర్వాతే జీఎస్‌టీ అసలు ప్రభావం తెలుస్తుందని చెపుతున్నారు.

హోటల్ భోజనం.. మొబైల్ బిల్లు పైపైకి
బ్యాంకింగ్, టెలికం సేవలు..., ఏసీ రెస్టారెంట్లలో భోజనం, మొబైల్ బిల్లులు, ట్యూషన్ ఫీజులు, సెలూన్ ఖర్చులు, రూ. 1000 దాటిన వస్త్రాలపై 6 శాతం పన్నును 12 శాతానికి పెంచారు. రూ. 1000 లోపు వస్త్రాలపై ఒక శాతం తగ్గించారు. ఫ్లాట్, షాపుల కొనుగోలుపై ప్రస్తుతం ఉన్న 6 శాతం పన్నును 12 శాతానికి పెంచారు.

ఎలక్ట్రానిక్ వస్తువుల ధరల్లో తగ్గుదల
వంటింట్లో వాడే కత్తులు, స్పూన్‌లు, కెచప్, సాస్, పచ్చళ్ల ధరలు.. బరువు తూచే యంత్రాలు, యూపీఎస్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, పారిశ్రామిక ఎలక్ట్రానిక్ వస్తువులు, వైండింగ్ వైర్లు, వాకీ టాకీలు, పోస్టల్, రెవెన్యూ స్టాంపుల ధరలు తగ్గనున్నాయి. ప్లేయింగ్ కార్డులు, చెస్, క్యారమ్ బోర్డు, ఇతర బోర్డు గేమ్స్‌పై పన్ను తగ్గించారు. ఉప్పు, చిన్నారుల రంగుల పుస్తకాలు, ఆహార ధాన్యాల్ని జీఎస్‌టీ నుంచి మినహాయించారు.
-
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications