కేసీఆర్ వ్యూహం: గెలిచింది 63, 82కు పెరిగిన బలం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన శైలి ప్రత్యేకం. ఉద్యమ నాయకుడిగా ఎంతో మంది ఉద్యమకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా నారాయణఖేడ్‌లో జరిగిన ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి భూపాల్‌రెడ్డి 53,625 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
39 వేల ఓట్లతో కాంగ్రెస్ సరిపెట్టుకోగా, టీడీపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసి 63 మంది గెలువగా, తాజా గెలుపుతో టీఆర్ఎస్ పార్టీలో(టీడీపీ)ఎమ్మెల్యేలతో కలుపుకుని సంఖ్య 82కు పెరిగింది.
సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్‌ను ఆదరించిన ప్రజలు, ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో అఖండ మెజారిటీని అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏ ఎన్నికలు జరిగినా అఖండ మెజారిటీని కట్టబెడుతున్నారు. ఇదిలా ఉంటే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా వివిధ పార్టీలకు చెందిన 18 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

తొలుత బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసి అనుకోని రీతిలో విజయం సాధించిన ఇంద్రకరణ్ రెడ్డి, ఆ తర్వాత కోనప్పలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొంతకాలం గడిచిన తర్వాత మరో 16 మంది ఎమ్మెల్యేలు అదే దారిలో నడిచారు. వీరిలో టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, చల్లా ధర్మారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, సాయన్న, వివేకానంద, ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్, రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
మరోవైపు కాంగ్రెస్ నుంచి నలుగురు, వైసీపీకి చెందిన ఇద్దరు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. కాగా, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు 82, కాంగ్రెస్‌కు 16, ఎంఐఎంకు 7, టీడీపీకి 5, బీజేపీకి 5గురు ఎమ్మెల్యేలు ఉండగా, వైకాపా, సీపీఐ, సీపీఎంలకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు.












Click it and Unblock the Notifications