మరో వివాదంలో కెసిఆర్: సుబ్రతా రాయ్ సహారా ఉచ్చు
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మరో వివాదంలో చిక్కుకున్నారు. సుబ్రతా రాయ్ సహారా కుంభకోణం ఉచ్చులో ఆయన చిక్కుకున్నారు. ఈ మేరకు గురువారం మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కెసిఆర్ చేతివాటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి.
సహారా కంపెనీకి ప్రయోజనం కలిగి విధంగా కసిఆర్ అసాధారణ, అనుచిత నిర్ణయాలు తీసుకున్నారని సీబీఐ దర్యాప్తు ద్వారా కేంద్రం గుర్తించినట్టు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇన్వెస్టర్లు, డిపాజిటర్ల నుంచి దాదాపు 24 వేల కోట్ల రూపాయలు సేకరించిన సహారా కంపెనీ చివరికి వారిని నిలువునా ముంచిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే సహారా అధినేత సుబ్రతారాయ్ ఏడాది కాలంగా తీహార్ జైల్లో ఉన్నారు.
ఈ కేసుకు సంబంధించి సహారా కంపెనీ లావాదేవీలపై పూర్తిగా విచారణ జరిపి తనకు నివేదించాల్సిందిగా సుప్రీంకోర్టు గతంలో సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు సహారా అక్రమాలపై సీబీఐ విచారణ జరుపుతున్నప్పుడు, కార్మిక శాఖ మంత్రిగా కెసిఆర్ నడిపిన వ్యవహారం బయటపడినట్లు చెబుతున్నారు.
మీడియా కథనాల ప్రకారం - సహారాకు, దానికి అనుబంధంగా ఉండే మరో నాలుగు కంపెనీలు - సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్, సహారా ఇండియా మాస్ కమ్యునికేషన్, సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేషన్ . సహారా ఎయిర్ లైన్స్ లిమిటెడ్‌లకు వాటి ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) ఖాతాలను సొంతంగా నిర్వహించుకునేందుకు కేసీఆర్ అనుమతి ఇచ్చారు.

ఆ కంపెనీలు 2006లో చేసుకున్న దరఖాస్తు మేరకు, వాటికి నిబంధనల నుంచి అక్రమంగా మినహాయింపు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, దశాబ్దాలుగా ఆర్థిక క్రమశిక్షణను పాటించే సంస్థలకు మాత్రమే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌తో సంబంధం లేకుండా సొంతంగా పీఎఫ్ ఖాతాలను నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. ఈ మేరకు వాటికి ఈపీఎఫ్ నుంచి కార్మిక శాఖ మినహాయింపు ఇస్తుంది.
అయితే, ఆ సంస్థలు సొంతంగా నిర్వహించుకునే పీఎఫ్ ఖాతాలపై ఈపీఎఫ్ ట్రస్టు బోర్డు నిరంతరం నిఘా వేస్తుంది. ఏవైనా ఫిర్యాదులు వచ్చినా, సొంతంగా ఖాతాలను సరిగ్గా నిర్వహించడం లేదని అనుమానం వచ్చినా మినహాయింపు అనుమతులను కేంద్రం రద్దు చేస్తుంది. చట్టం ఇంత పకడ్బందీగా నిర్దేశించినా సహారా కంపెనీ విషయంలో కేసీఆర్ నిబంధనలను పక్కనబెట్టారు. అప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన సహారా, నావు అనుబంధ కంపెనీలకు ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలను సొంతంగా నిర్వహించుకునేందుకు అనుమతించారు. ఈ మేరకు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.
సహారా గ్రూప్ కంపెనీల్లో దాదాపు 11 లక్షల మంది ఉద్యోగులున్నారు. వారి నుంచి పీఎఫ్ కంట్రిబ్యూషన్ రూపంలో ప్రతి నెలా వందల కోట్ల రూపాయలు జమవుతాయి. వీటికి కంపెనీ తన వాటాను జోడించి ఈపీఎఫ్ ఖాతాలకు కట్టాల్సి ఉంటుంది. అయితే, కేసీఆర్ ఇచ్చిన మినహాయింపు వల్ల సహారా కంపెనీకి సొంతంగా పీఎఫ్ ఖాతాలు నిర్వహించుకునే అవకాశం దక్కింది. అంటే తన వాటా నిధులను జమ చేసినా, చేయకపోయినా అడిగేవారు లేకపోగా, ఉద్యోగుల నుంచి వసూలు చేసే వందల కోట్ల కంట్రిబ్యూషన్‌పై కూడా కంపెనీకే పట్టు చిక్కింది.
నష్టాల్లో కూరుకుపోయి దివాలా తీసే దశలో ఉన్న సహారా గ్రూప్‌నకు ఈపీఎఫ్ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తే, ఆ కంపెనీల్లోని ఉద్యోగులకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ అప్పటి చీఫ్ ప్రావిడెండ్ ఫండ్ కమిషనర్ (సీపీఎఫ్‌సీ) ముందే హెచ్చరించినా కేసీఆర్ పట్టించుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయంటూ ఓ ప్రముఖ దినపత్రిక రాసింది.












Click it and Unblock the Notifications