భయం: వేములవాడ రాజన్నకు కెసిఆర్ దూరం?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై జ్యోతిషం విపరీతంగా పనిచేస్తోంది. ఛాతీ వైద్యశాలను మార్చి అక్కడికి సచివాలయాన్ని మార్చాలనే నిర్ణయం వెనక పనిచేసింది కూడా అదే. తాజాగా, ఆయన శివరాత్రి నాడు వేములవాడుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 17వతేదీన శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించుకూడదని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.
వేములవాడ ఆలయాన్ని సందర్శిస్తే రాజకీయంగా దెబ్బ తగులుతుందని జ్యోతిష్కులు చెప్పడమే అందుకు కారణమని అంటున్నారు. ఆలయానికి వస్తానని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని కెసిఆర్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. గత సీమాంధ్ర పాలకులు ఆలయాన్ని విస్మరించడం పట్ల ఆయన అప్పట్లో ఆవేదన కూడా వ్యక్తం చేశారు.

వేములవాడ శాసనసభా నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నుంచి పోటీ చేసిన చెన్నమనేని రమేష్ విజయం సాధించారు. ప్రజాప్రతినిధుల రాజకీయ జీవితాలపై ఆలయం వ్యతిరేక ప్రభావం చూపుతుందనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. వేములవాడ ఆలయంలో పూజలు చేసిన రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చారని అంటారు.
శివరాత్రి రోజు ఆలయాన్ని సందర్శించి పట్టువస్త్రాలు సమర్పించాలని కెసిఆర్ అనుకున్నారు. అయితే, ప్రతి పర్యటనకు ముందు జ్యోతిష్కుల సలహాలు తీసుకునే కెసిఆర్ ఈ విషయంలో కూడా సలహా అడిగారని అంటున్నారు. అయితే, అక్కడికి వెళ్లవద్దని వారు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మొత్తానికే వేములవాడ పర్యటనను రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications