వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ మంత్రివర్గ విస్తరణ: పక్కా రాజకీయ వ్యూహం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణ చేసినట్లు కనిపిస్తోంది. పాలనానుభవంతో పాటు రాజకీయానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయాల్లో తలలు పండినవారిని మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి, గతంలో మంత్రులుగా పనిచేసి, సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్నవారికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇప్పటి వరకు పోచారం శ్రీనివాస రెడ్డి వంటి కొద్ది మంది మాత్రమే పరిపాలనలో అనుభవం ఉన్నవారు మంత్రివర్గంలో ఉన్నారు. చాలా మందికి పాలనపై గానీ, అధికార రాజకీయాలపై గానీ అనుభవం లేదు.

ఆ ఉద్దేశంతోనే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని మంత్రివర్గంలో చేర్చుకున్నారని, శాఖల కేటాయింపులోనూ ఆయన తనదైన శైలికే ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నారు. ఈ ఏడాది జూన్‌ 2న ప్రభుత్వం కొలువుదీరినప్పుడు రంగారెడ్డి జిల్లా నుంచి పి.మహేందర్‌ రెడ్డికి పదవి కట్టబెట్టటంపై పార్టీలో తెలంగాణ ఉద్యమకారుల నుంచి అంతర్గతంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్నప్పుడు మహేందర్‌రెడ్డి తెలంగాణవాదులపై నిర్బంధానికి కారణమయ్యారనే ఆరోపణలున్నాయి. కానీ, కెసిఆర్ వాటిని పట్టించుకోలేదు. ఆయనకు కీలకమైన రవాణా శాఖ కట్టబెట్టారు.

KCR takes up expansion for future politics

ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో కొత్తగా పార్టీలోకి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్‌, అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డిలను కేబినెట్‌లోకి తీసుకోవటాన్ని పార్టీలోని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాదని, బయటి నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయటాన్ని వారు తప్పుపడుతున్నారు. అయితే, అలా వారికి మంత్రి పదవులు ఇవ్వడం వెనక పక్కా వ్యూహం ఉందని భావిస్తున్నారు.

తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి కూడా రాజకీయంగా అనుభవం ఉన్నవారు. పైగా, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో టిఆర్ఎస్ బలహీనంగా ఉంది. త్వరలో జరగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో తలసాని శ్రీనివాసయాదవ్‌కు మంత్రివర్గంలో చోటు ఇవ్వటం తమకు కలిసి వస్తుందని అంటున్నాయి. అన్ని సామాజిక వర్గాలూ టీఆర్‌ఎస్‌ వైపు ఉన్నాయనే సంకేతాలు ఇవ్వటానికి తుమ్మలను కేబినెట్‌లోకి తీసుకున్నారని, ఆయన అనుభవం ప్రభుత్వానికి అక్కరకు వస్తుందని, గ్రేటర్‌ ఎన్నికల్లోనూ పార్టీకి ఉపయోగపడ్తారని చెబుతున్నాయి. తెలంగాణేతరులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో తుమ్మల నాగేశ్వర రావు సామాజిక వర్గం కలిసి వస్తుందని అంటున్నారు.

తుమ్మలకు కెసిఆర్ కీలకమైన రోడ్లు, భవనాల శాఖ ఇచ్చారు. రూ.10 వేల కోట్లతో తెలంగాణవ్యాప్తంగా రోడ్ల అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో ఆ శాఖను తుమ్మలకు కేటాయించటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇంద్రకరణ్ రెడ్డికి ప్రధానమైన గృహనిర్మాణ శాఖను ఇచ్చారు. 125 గజాల్లో పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని టీఆర్‌ఎస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విషయం తెలిసిందే. ఇక మంత్రిగా అనుభవం ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్‌కు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే కీలకమైన వాణిజ్య పన్నుల శాఖను అప్పగించారు.

ప్రస్తుతం మంత్రివర్గంలోకి వచ్చిన ఐదుగురు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస యాదవ్, జూపల్లి కృష్ణారావు రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడానికి కూడా పనికి వస్తారని కెసిఆర్ భావించినట్లు సమాచారం.

English summary
It is said that Telangana CM K Chandrasekhar Rao has takenup cabinet expansion for future politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X