అసెంబ్లీలో ఏసీ లేదని జగన్ పార్టీ, చెమటలతోనే..!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పాత అసెంబ్లీ హాలు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల సంఖ్య తెలంగాణ ఎమ్మెల్యేల సంఖ్య కన్నా ఎక్కువగా ఉన్నందున, తమకు కొత్త అసెంబ్లీ హాల్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

గురువారం సమావేశం జరిగిన పాత అసెంబ్లీ హాల్‌లో కనీసం ఫ్యాన్లు, ఏసి వంటి వసతులు కల్పించకపోవటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం జరిగినంత సేపు తామెన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఆయన వివరించారు. ఈ హాల్‌లో కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిలు ఒకరికొకరు కన్పించని విధంగా సిట్టింగ్ విధానం ఉందన్నారు.

స్పీకర్ పొడియం కూడా సరిగ్గా లేదని, సౌకర్యాలు కల్పించటంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగనున్న హైదరాబాద్ నగరంలో తమకు అనుకూలమైన అసెంబ్లీ లేకపోవటం శోచనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ, గంటూరుల మధ్య అన్ని సౌకర్యాలతో కూడిన తాత్కాలిక అసెంబ్లీ హాల్‌ను ఏర్పాటు చేయాలని జలీల్‌ఖాన్ కోరారు. కాగా, గురువారం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కొందరికి చెమట పట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే సౌండ్ సిస్టం కూడా మొదట ఇబ్బంది కలిగించిందట.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎపిలో మంచి అసెంబ్లీని నిర్మిస్తామని ఎమ్మెల్యే కదిరి బాబూరావు శుక్రవారం అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ప్రస్తుతం హైదరాబాదులో సమావేశ మందిరం కేటాయించాలేదని, ఎమ్మెల్యేలకు సరైన వసతులు కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ సభ్యులున్న రాష్ట్రానికి పెద్ద సమావేశ మందిరం, ఎక్కువ సభ్యులున్న రాష్ట్రానికి చిన్న హాలున్న భవనం కేటాయించారన్నారు.












Click it and Unblock the Notifications