నవంబర్ 1: ఇదే ఆఖరు, వెళ్లి ఇంకేం చెప్తాం?
కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్రం విభజనపై దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో ఈ నవంబర్ 1(2013 నవంబర్ 1) ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి చివరిది కావొచ్చంటున్నారు. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. దీనిని తెలంగాణవాదులు వ్యతిరేకిస్తున్నప్పటికీ అధికారికంగా దీనిని నిర్వహిస్తున్నారు. విభజన ప్రక్రియ వచ్చే ఎన్నికల కంటే ముందే పూర్తవుతుందనే వాదనల నేపథ్యంలో ఈ అవతరణ దినోత్సవమే సమైక్య రాష్ట్రానికి చివరిది అంటున్నారు.
అవతరణ దినోత్సవాలను బహిష్కరించాలని తెలంగాణ ప్రాంత మంత్రులు బహిష్కరించనున్నారు. గత మూడేళ్లుగా తెలంగాణ మంత్రులు వీటిని బహిష్కరిస్తున్నారు. ఈసారి కూడా బహిష్కరించనున్నారు. అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతంలో కూడా ఈ వేడుకకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశముంది.

కాంగ్రెసు పార్టీ విభజన నిర్ణయాన్ని సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిడబ్ల్యూసి నిర్ణయం వచ్చినప్పటి నుండి సీమాంధ్రలో ఉద్యమం జరుగుతోంది. విభజనకు అడుగులు పడుతున్న సమయంలో ఈ వేడుకను నిర్వహిస్తే పదమూడు జిల్లాల ప్రజలు తమ తమ ప్రాంతాల్లో అడ్డుకునే అవకాశముంది. పలువురు నేతలు వేడుకలకు వెళ్లేందుకు ఆసక్తి కనబర్చడం లేదట.
అవతరణ దినోత్సవాలను తెలంగాణ మంత్రులు బహిష్కరించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించనున్నారని చెబుతున్నారు.
విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో కాంగ్రెసు పార్టీ పైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలకు వెళ్లి అవతరణ దినోత్సవాల్లో పాల్గొనడం కష్టసాధ్యమేనని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకెళ్తున్న సమయంలో సీమాంధ్రలో అవతరణ దినోత్సవంలో పాల్గొని ప్రజలకు ఏం చెప్పగల్గుతామని కాంగ్రెసు సీమాంధ్ర నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యమంత్రి మాత్రం రాజధానిలో జరిగే అవతరణ దినోత్సవంలో పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications