తెలుగు రాష్ట్రాల లొల్లి: బాబు సీరియస్, కేసీఆర్ పట్టు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా జలవివాదంతో తారాస్థాయికి చేరుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా కేంద్రానికి, గవర్నర్‌కు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.
తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి ఫిర్యాదు చేశారు. దీనికి పోటీగా ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉమామహేశ్వర రావు మంగళవారం ఢిల్లీకి వెళ్లింది. కేంద్రానికి విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఫిర్యాదు చేయనున్నారు.
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు కూడా వాగ్బాణాలు విసురుకుంటున్నారు. అంతే కాకుండా, ఇరువురు కూడా గవర్నర్‌కు ఫిర్యాదులు చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ నుండి వచ్చిన కేసీఆర్ సోమవారం సాయంత్రం నరసింహన్‌ను కలిశారు.

తెలంగాణ కరెంట్ అవసరాలు తీర్చడానికి ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుపై ఒప్పందం కుదిరిందని గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ కేసీఆర్ వివరించారు. రెండు రోజుల ఛత్తీస్‌గఢ్‌పర్యటన ముగించుకొని సోమవారం సాయంత్రం రాష్ట్రానికి వచ్చిన ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌తో సమావేశమయ్యారు.
1000 మెగావాట్ల ఒప్పందం కుదుర్చుకోవడంలో రమణ్‌సింగ్ ప్రభుత్వ స్పందన బాగుందని కేసీఆర్ వివరించారు. అలాగే, శ్రీశైలంలో విద్యుదుత్పాదన నిలిపివేయాలని కృష్ణా రివర్ బోర్డు ఇచ్చిన ఆదేశాలపై గవర్నర్‌కు నివేదించారు. తెలంగాణ అవసరాల నేపథ్యంలో విద్యుదుత్పత్తి విషయంలో ముందుకు వెళ్లాలా? వద్దా అని నరసింహన్‌ను కేసీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం విద్యుత్ విషయంలో రాద్దాంతం చేస్తోందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఫిర్యాదు చేశారు.
మంగళవారం ఉదయం చంద్రబాబు గవర్నర్‌ను కలిశారు. కృష్ణా బోర్డు తీర్పుని తెలంగాణ ప్రభుత్వం లెక్క చేయడం లేదని గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకు వచ్చారు. గవర్నర్‌ను చంద్రబాబు కలిసిన నేపథ్యంలో కేసీఆర్ మరోసారి నరసింహన్‌తో భేటీ కానున్నారు.
ఇదిలా ఉండగా, కార్మిక శాఖలోని నాలుగు వందలకు పైగా కోట్ల రూపాయల బదలీ విషయంలోని ఏపీ ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నది. ఈ మొత్తం తమకు చెందినదేనని, అందుకే ట్రాన్సుఫర్ చేశామని, దీనికి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని అభిప్రాయపడుతోంది. అలాంటప్పుడు తమ అధికారుల పైన కేసులు పెట్టడాన్ని తీవ్రంగా చూస్తోంది.
శ్రీశైలంలో కొనసాగుతున్న జలవిద్యుదుత్పత్తి
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి జలవిద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఒక యూనిట్ ద్వారా 135 మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉత్పత్తి చేస్తోంది. 9వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు, ఏపీతో తాడోపేడో తేల్చుకునేందుకు తెలంగాణ సర్కారు ఉంది.












Click it and Unblock the Notifications