టెండూల్కర్ దత్తత: ఆకాశంలో అంకురార్పణ
నెల్లూరు: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకోవడంతోనే ఆ మారుమూల గ్రామం దశ తిరిగింది. జాతీయ స్థాయిలో ఆ గ్రామం పేరు మారుమోగింది. ఇప్పుడు ఆ గ్రామానికి జాతీయ అవార్డు కూడా లభించింది. మొత్తంగా 110 కుటుంబాల్లో 330 మంది జీవిస్తున్న ఆ పల్లె ‘పుట్టంరాజువారికండ్రిగ' ఇప్పుడు అత్యంత ప్రశాంత జీవనం గడుపుతోంది.
క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో దీని ముఖచిత్రమే మారిపోయింది. సచిన్ దాన్ని దత్తత తీసుకోవడానికి ప్రధాన కారకురాలు ఐఏఎస్ అధికారిణి గోర్లే రేఖారాణి. సచిన్ దత్తత తీసుకునే వరకు గ్రామం ఘోరమైన దుస్థితిలో ఉండేది.
ఇప్పుడు గ్రామమంతా సిమెంటు రోడ్డు సింగారాలు, భూగర్భ డ్రైనేజీ, అందుబాటులోకి సాంకేతిక పరిజ్ఞానం తీసుకు వస్తున్నారు. కాగా, స్థానిక వనరులను సద్వినియోగం చేసుకున్న గ్రామాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంసద్ ఆదర్శ యోజన పథకం కింద ఉత్తమ గ్రామాలుగా ఎంపిక చేసి జాతీయ అవార్డును ఇస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 32 గ్రామాలను ఎంపిక చేశారు. ఈ జాబితాలో పుట్టంరాజువారికండ్రిగకు చోటు దక్కింది.

పుట్టంరాజువారికండ్రిక అభివృద్ధికి ఆకాశంలో అంకురార్పణ జరిగిందని సరదాగా చెప్పుకుంటారు. ఐఏఎస్ అధికారిణి రేఖారాణి నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్న సమయంలో 2014 సెప్టెంబర్ 11న అమెరికా నుంచి భారత్‌కు విమానంలో వస్తున్నారు. అదే విమానంలో సచిన్ పయనిస్తున్నారు. అందరూ పోటాపోటీగా సచిన్ నుంచి ఆటోగ్రాఫ్‌లు తీసుకుని, ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు.
ఆ సమయంలో రేఖారాణి మాత్రం సచిన్ రాజ్యసభ సభ్యుడని గుర్తు పెట్టుకుని, దత్తత గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చారు. అనంతరం, సెప్టెంబర్ 16న నెల్లూరుకు వచ్చిన రేఖారాణి ఇదే విషయాన్ని అప్పటి కలెక్టర్ శ్రీకాంత్ దృష్టికి తెచ్చారు. దాంతో, ఆయన సచిన్‌తో మాట్లాడారు. దత్తత గ్రామాల ఆవశ్యకతను వివరించారు. పుట్టంరాజువారికండ్రిగను దత్తత తీసుకుంటానని సచిన్ హామీ ఇచ్చి ప్రకటన కూడా చేశారు.
సచిన్ ప్రకటన తర్వాత ఆయన వ్యక్తిగత సహాయకులు, కొందరు అధికారులు పుట్టంరాజువారికండ్రిగకు వచ్చి పరిశీలించారు. అనంతరం సచిన్ తన రాజ్యసభ నిధుల నుంచి రూ.2.79 కోట్లు మంజూరు చేశారు. సచిన్ దత్తత తీసుకోవడానికి ముందే కలెక్టర్ శ్రీకాంత్ రూ.3 కోట్లతో ఆ గ్రామాభివృద్ధి చేపట్టారు. సచిన్ దత్తత తర్వాత మొత్తం రూ.5.79 కోట్లు అందుబాటులోకి వచ్చాయి.
రేఖారాణి గ్రామాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, కమ్యూనిటీ భవనం, స్టేడియం, అంగన్‌వాడీ కేంద్రాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేలా ప్రతిపాదించారు. జీవనోపాధి కోసం చేపలు పెంపకం చేపట్టాలని సూచించారు. శ్మశాన అభివృద్ధి పనులను ప్రతిపాదించారు. ఆ తర్వాత సచిన్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి పుట్టంరాజువారికండ్రిగను దత్తత తీసుకున్నట్లు వెల్లడించారు.
నవంబరు 16న క్రికెట్ దిగ్గజం రిటైరైన రోజు. అదే రోజున పుట్టంరాజువారికండ్రిగకు వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చకు తెరతీసింది. అప్పటి నుంచి ఆ గ్రామం ఒక వెలుగు వెలుగుతోంది.












Click it and Unblock the Notifications